‘ఆర్ఆర్సీ’ లీకేజీ కలకలం!
తీగలాగితే డొంక కదులుతోంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తాండూరులో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో స్థానిక ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్టిబ్యూషన్(టీఆర్డీ)లో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న మహేం దర్ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఆర్ఆర్సీ’ వ్యవహారం బయట పడిన నాటి నుంచే పోలీసులు మహేందర్ కోసం ఆరా తీసున్నట్టు సమాచారం.
- తాండూరు
తాండూరు: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తాండూరులో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తాండూరు ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్(టీఆర్డీ)లో టెక్నిషియన్ మహేందర్‌రెడ్డి సూత్రధారి అని జరుగుతున్న ప్రచారం రైల్వే వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో మహేందర్ ప్రమేయం ఉన్నట్టు ప్రచార మాధ్యమాల్లో రావడంతో ఇక్కడి రైల్వే వర్గాలు విస్మయం చెందుతున్నాయి. ఇక్కడ పనిచేసే మహేందరేనా? వేరే వ్యక్తా అని వారు భావిస్తున్నారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడిన నాటినుంచి అతడు విధులకు హాజరుకాకపోవడంతో మహేందర్‌రెడ్డిపై అనుమానాలు బలపడుతున్నాయి.
వరంగల్ జిల్లా జనగాం(శామిర్పేట్)కు చెందినట్టుగా భావిస్తున్న మహేందర్ విజయవాడలో శిక్షణ పూర్తి చేశారు. 2012 సెప్టెంబర్‌లో తాండూరులో టీఆర్డీలో టెక్నిషియన్‌గా నియామకమయ్యాయరు. పాతతాండూరులో ఆయన కిరాయి ఇంట్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, మూడు నెలల పాప ఉన్నారు. ఈనెల 1వ తేదీ వరకు మహేందర్ విధులకు హాజరయ్యాడని తెలిసింది. అయితే మరుసటి రోజు తనకు 15 రోజులపాటు సెలవు కావాలని అధికారులకు లిఖితపూర్వకంగా కోరాడు. అయితే అతనికి ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదని తెలిసింది. అయితే ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారం వెలుగుచూసినప్పటి నుంచి మహేందర్ విధులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది.
ఆయన కిరాయికి ఉంటున్న ఇంటికి తాళం వేసింది. కుటుంబసభ్యులను తన స్వగ్రామానికి పంపించినట్టు సమాచారం. సంబంధిత అధికారులు మహేందర్‌కు సెల్ఫోన్లకు కాల్ చేసినా అవి స్వీచాఫ్ వస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచేసిన రోజునే రైల్వే పోలీసు వర్గాలు మహేందర్ గురించి ఆరా తీశారని సమాచారం. మొత్తమ్మీద ఆర్ఆర్సీ వ్యవహారంలో మహేందర్ పాత్ర తాండూరులో రైల్వే వర్గాల్లో కలకలం రేపుతోంది.