బీబీనగర్ - నడికుడి రైల్వేలైన్.. మెగాబ్లాక్
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : బీబీనగర్ - నడికుడి రైల్వేలైన్ మెగా బ్లాక్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వేలైన్‌లో అత్యంత ప్రధానమైన కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద బ్రిడ్జిల నిర్మాణానికి గాను మెగాబ్లాక్‌ను ప్రకటించింది. బీబీనగర్ నుంచి నడికుడి వరకు పగిడిపల్లి-నాగిరెడ్డిపల్లి మధ్యలో ఒకచోట, విష్ణుపురం-పొందుగుల స్టేషన్ల మధ్య మరో చోట బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఈ మేరకు 23, 25 తేదీలలో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపునకు వెళ్లే రైళ్లలో కొన్నింటిని రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అంతే కాకుండా ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించడంతో పాటు సమయాన్ని క్రమబద్ధీకరించారు.
దారి మళ్లించే రైళ్లు..
నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ : హైదరాబాద్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్లే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఖాజీపేట, విజయవాడ మీదుగా ఈ నెల 23, 25వ తేదీలలో దారి మళ్లించనున్నారు.
డెల్టా పాస్ట్ ప్యాసింజర్ : కాచిగూడ నుంచి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా రేపల్లెకు వెళ్లే ప్యాసింజర్‌ను ఈ నెల 23, 25వ తేదీలలో ఖాజీపేట, విజయవాడ, కొత్త గుంటూరు మీదుగా మళ్లిస్తారు.
రేపల్లె ప్యాసింజర్ పాక్షికంగా రద్దు..
రేపల్లె ప్యాసింజర్ రైలును పాక్షికంగా రద్దు చేశారు. రేపల్లె నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లు ప్యాసింజర్ రైలు నడికుడి - నల్లగొండ మధ్య పాక్షికంగా రద్దు చేసి నడికుడి నుంచి రేపల్లెకు అక్టోబర్ 1న వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు వెళ్లే నల్లగొండ - నడికుడి మధ్య పాక్షికంగా రద్దయి నల్లగొండ నుంచి సికింద్రాబాద్‌కు అక్టోబర్ 1న తిరిగి వస్తుంది.
ఆలస్యంగా వెళ్లే రైళ్లు..
విశాఖపట్నం - సికింద్రాబాద్‌లకు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 1న 45 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది. అదే విధంగా సికింద్రాబాద్‌లో రాత్రి 12.25 గంటలకు బయలుదేరి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా కోచువేలి (తిరువనంతపురం) వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్ ఒక గంట ఆలస్యంగా వెళ్తుంది.