మూడు రోజుల పోలీస్ కస్టడీకి టుండా
న్యూఢిల్లీ : నగరంలో 1997 అక్టోబర్ 26న జరిగిన బాంబుపేలుడు కేసులో ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇప్పటివరకు వివిధ బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీస్ కస్టడీలో ఉన్న టుండాను శుక్రవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, అతడిని 1997 అక్టోబర్ 26 బాంబు పేలుళ్ల కేసులో విచారించాల్సిన అవసరం ఉందని, అందువల్ల అతడిని తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరగా, మేజిస్ట్రేట్ పై విధంగా తీర్పు చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 37 బాంబు పేలుళ్ల కేసుల్లో టుండాకు సంబంధం ఉందంటూ పోలీసులు అతడిని అరెస్టు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే.
గత రెండు రోజుల క్రితం అతని బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు చేయాలన్న పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల అతడికి బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని తెలిపింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సల్ ఎదుట హాజరైన టుండా.. తనకు బ్రెయిన్ మ్యాపింగ్ చేయొద్దని కోరాడు. తన వయసు 72 సంవత్సరాలని, వివిధ వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఇటీవలే తనకు పేస్ మేకర్ అమర్చారని, హైబీపీతో కూడా బాధపడుతున్నానని తెలిపాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బ్రెయిన్ మ్యాపింగ్ వద్దని కోరాడు. తనకు ఈ పరీక్ష అంటే ఏంటో, దాని పరిణామాలేంటో కూడా తెలుసని కోర్టుకు చెప్పాడు.