మృత్యు వాన
♦ నగరంలో వేర్వేరు చోట్ల నలుగురు బలి
♦ కాలనీలు, రహదారులు జలమయం
♦ ఉప్పొంగిన నాలాలు
♦ జనజీవనం అతలాకుతలం
♦ ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో ఐదు రోజులుగాకురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ముఖ్యంగా సోమవారం రాత్రి నుంచివర్షం బీభత్సం సృష్టించింది. నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఉప్పుగూడ అరుంధతి నగర్ కాలనీలో ఉప్పొంగుతున్న నాలాలో పడి సంజయ్(7) అనే బాలుడు మృతిచెందాడు. తుకారాంగేట్ వద్ద రైల్వే వరద కాల్వలో పడి గుర్తుతెలియని వ్యక్తి(50) మృత్యువాత పడ్డాడు. విద్యుత్ తీగలు తెగిపడడంతో మియాపూర్ ఆల్విన్ కాలనీలో కె.లక్ష్మణ్ రాజు(18), సోమరాజు(12)లు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి 10 నుంచి మంగళవారం(14న) ఉదయం 11 గంటల వరకు నగరంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.
నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులపై మోకాలి లోతున వరదనీరు ప్రవహించింది. మెట్రో పనులు జరుగుతున్న మలక్‌పేట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సికిం ద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. మరో 24 గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అంధకారం
వర్షాలతో గ్రేటర్‌లోని సుమారు 200 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సరూర్‌నగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. విద్యుత్ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసినా ఫలితం కనిపించకపోవడంతో అంధకారంలోనే గడిపారు.
ఇదీ పరిస్థితి...
మూసాపేటలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వడగండ్లతో కురిసిన వర్షంతో కూకట్పల్లి నియోజకవర్గంలో చెట్లు కూలడమే కాక రోడ్లన్నీ జలమయమయ్యాయి. మూసాపేట డివిజన్ శివశక్తినగర్‌లో వర్షానికి భారీ చెట్టు కూలి 11కేవీ విద్యుత్ వైర్లపై పడటంతో రెండు స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి సమయంలో జరగడంతో ప్రమాదం తప్పింది.
♦ ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి పరిధిలోని కాలనీల్లో చెట్లు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆరుల్కాలనీ, హస్తినాపురి, సాయిపురి, కందిగూడ, డీఎల్ఆర్ ఎన్క్లేవ్లలో చెట్లు నేలకూలాయి.
♦ యాప్రాల్ డివిజన్లోని రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. స్థానిక బస్ షెల్టర్ కూలి ఓ ఆటో దెబ్బతింది. యాప్రాల్ నుంచి కౌకూర్ వెళ్లే రోడ్డు, తులసి గార్డెన్ రోడ్డు ఎస్ఎస్ ఎన్క్లేవ్ కాలనీల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేజేనగర్, పరిసర కాలనీలలో డ్రైనేజీ లీకేజీలతో అవస్థలు పడ్డారు.
♦ శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరింది.
♦ సలీంనగర్, మూసారంబాగ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు సలీంనగర్ డివిజన్ శ్రీపురం కాలనీలోని చెట్లు నేలకూలాయి.
♦ కంటోన్మెంట్ ఐదో వార్డులోని గృహలక్ష్మీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి చెట్లు విరిగి మూడు విద్యుత్ స్తంభాలపై పడడంతో అవి నేలకొరిగాయి. మంటలు వ్యాపించడంతో... విద్యుత్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
♦ నాచారం పెద్ద చెరువు ప్రాంతంలో వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
♦ పాతనగరంలోని ఛత్రినాకలో వడగళ్ల వర్షానికి ప్రజలు భయకంపితులయ్యారు. దాదాపు పది నిమిషాల పాటు పెద్ద ఎత్తున వడగళ్లు పడడంతో రేకుల గదులలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నల్లవాగు నాలా ఉప్పొంగింది.
♦ మారేడ్‌పల్లి అంబేద్కర్ నగర్ రైల్ నిలయం పక్కన ఉన్న నాలా శ్లాబ్ కూలిపోయింది. బస్తీ ప్రారంభంలో ఓ కంపెనీ వారు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి తొవ్విన పెద్ద గొయ్యిలోకి వర్షపునీరు చేరింది. ఈ గొయ్యి దాదాపు 30 అడుగుల లోతు.. 150 అడుగల పొడవు ఉంది. ఈ నీటి తాకిడికి బస్తీలోని కొన్ని ఇళ్ల గోడలు పూర్తిగా నానిపోయాయి. దీనికిఆనుకుని ఉన్న నల్లపోచమ్మ ఆలయ ప్రహరీ కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన కాంప్లెక్స్ యాజమాన్యం నీటిని తోడే కార్యక్రమం మొదలు పెట్టింది.
♦ నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో భారీ చెట్టు కూలిపోయింది. రాత్రి కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
♦ రాజన్నబావి నుంచి ఛత్రినాక పరిసరాలలో వరద నీరు పెద్ద ఎత్తున రోడ్లపై పారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
♦ మలక్‌పేట్, చాదర్‌ఘాట్, నల్గొండ క్రాస్‌రోడ్డు, దిల్సుఖ్నగర్, కొత్తపేట్, సరూర్‌నగర్, లెనిన్‌నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
♦ పాతనగరంలోని అనేక బస్తీలలో మ్యాన్‌హోళ్లకు మూతలు లేకపోవడంతో ముందు జాగ్రత్తగా స్థానికులు డబ్బాలు, చెట్ల కొమ్మలను అందులో ఏర్పాటు చేసుకొని ప్రమాదాలు జరగకుండా చూసుకున్నారు. దుర్దానా హోటల్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ పక్కన భారీగా వరద నీరు నిలిచిపోయింది. అందులో ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున మొరాయించాయి.
♦ అరుంధతి కాలనీ బ్రిడ్జి వద్ద వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో పాదచారులు బ్రిడ్జి పైనుంచి నడిచి వెళ్లాల్సి వచ్చింది. లలితాబాగ్ ప్రధాన రహదారి తవ్వేయడంతో వరద నీరు భారీగా చేరింది. భయ్యాలాల్ నగర్ బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
♦ నర్సాపూర్ రాష్ట్ర రహదారి గుంతలమయంగా మారింది. జీడిమెట్ల- దూలపల్లి ప్రధాన రహదారి చెరువును తలపించింది.
♦ జీడిమెట్ల బస్ డిపో సమీపంలో రోడ్డంతా ఛిద్రమైంది. గండిమైసమ్మ చౌరస్తాలో రహదారిపై భారీ గుంతలు పడ్డాయి.
♦ జాతీయ రహదారి 44 పేట్ బషీరాబాద్ వద్ద రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్టును అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.