
సాక్షి,హైదరాబాద్: నగరాన్ని వర్షం హడలెత్తించింది. పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ కావటంతో కుండపోతగా వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుండి కురిసిన అతిభారీ వర్షంతో నగరంలో పలు కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. గుడిమల్కాపూర్‌లో 3 గం టల వ్యవధిలో 14.93 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. శివరాంపల్లిలో 14.05, మోండాలో 13.95, రెడ్‌హిల్స్‌లో 13.53 విజయనగర్‌కాలనీలో 13.2, తిరుమలగిరిలో 12.48, ముషీరాబాద్‌లో 11.98, శ్రీనగర్‌కాలనీలో 11.73 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నగరమంతటా సగటున 8.97 సెం.మీ. వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు నీటముని గాయి. కార్వాన్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో శుక్రవారం మధ్యాహ్నం దాకా సాధారణ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుడిమల్కాపూర్, నానల్‌నగర్, టోలిచౌకి ప్రధాన రహదారులపై వరద ముంచెత్తింది. కార్వాన్, గోల్కొండ డివిజన్లలోడ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది.
మల్కాజిగిరిలో అవే అవస్థలు
మల్కాజిగిరి, ఉప్పల్‌లో పలు కాలనీలు జలమయం కావటం, నాలాలు ఉప్పొంగటంతో జనాలు అవస్థల పాలయ్యారు. మల్కాజిగిరిలో బండచెరువు పరిసరాల్లోని కాలనీలు వరదనీటిలో మునిగిపోవటంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నాచారం హెచ్‌ఎంటీ నాలా ఉధృతంగా ప్రవహించటంతో ఉప్పల్– చిలుకానగర్, ఉప్పల్ –స్వరూప్‌నగర్‌లో రాకపోకలు మధ్యాహ్నం వరకూ నిలిచిపోయాయి. ఉప్పల్, బోడుప్పల్ పరిధిలోని కాలనీల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
మల్కాజిగిరి వర్షమే రికార్డ్
నగరంలో ఇప్పటివరకు మల్కాజిగిరిలోనే రికార్డు వర్షం కురిసింది. 2017 సెప్టెంబర్ 14న మల్కాజిగిరిలో కురిసిన 20.15 సెం.మీ. వర్షపాతమే ఇప్పటివరకు అత్యధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం పేర్కొంది.
కూలిన గోల్కొండ సెంట్రీ గది గోల్కొండ:
భారీ వర్షాలకు చారిత్రక గోల్కొండ కోట మోతీ దర్వాజాను ఆనుకొని ఉన్న సెంట్రీ గది కూలింది. కోట నిర్మించిన అనంతరం నయాఖిల్లా నిర్మాణ సమయంలో మోతీదర్వా జా వద్ద ఈ గదిని నిర్మించారు. దర్వాజా వద్ద కాపలా ఉండే సైనికులు దీనిని రెస్ట్‌రూంగా ఉపయోగించేవారు. ఈ గదిలో ఫిరంగిగుండ్లు, విషసర్పాలు, తేళ్లను కూడా ఉంచేవారు. శత్రువులు కోటపైకి దండెత్తినప్పుడు దర్వాజా బయట కందకాలలో విషసర్పాలు, తేళ్లను వదిలేవారు. శత్రువులు కందకాల నుంచి ఈదుకుంటూ లోపలికి రాకుండా ఈ విధంగా చేసేవారు. కాగా, కూలే సమయంలో గదిలో ఒక ఎద్దు, 3 ఆవులు ఉన్నాయి. కూలిన తర్వాత రెండు ఆవులు, ఎద్దును బయటకు తీశారని కోట పరిరక్షణాధికారి ఎ.భానుప్రకాష్ వర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment