పిడుగుల వాన
రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది దుర్మరణం
* కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
* మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
సాక్షి నెట్వర్క్: కుండపోత వర్షాలు, పిడుగులతో ఆదివారం రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క పిడుగులే 20 మందిని బలితీసుకున్నాయి. వర్షాలకు గోడకూలి మరొకరు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి.
పిడుగులకు నెల్లూరు జిల్లాలో ఆరుగురు(వీరిలో గోడకూలి ఒకరు), ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. దీనిపై ఆదివారం సాయంత్రం సమీక్షించిన సీఎం చంద్రబాబు నాయుడు.. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా జిల్లా కరకట్టపై తన నివాసానికి చేరుకొని ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పరిహారాన్ని సోమవారమే బాధిత కుటుంబాలకు అందజేయాలని ఆదేశించారు.
కోస్తా, రాయలసీమలకు భారీ వర్షాలు..
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వర కూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అస్సాం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖా తం వరకు వాయవ్య బంగాళాఖాతం మీదు గా ఉపరితల ద్రోణి ఏర్పడింది. రాను న్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, కొన్నిచోట్ల భారీ వర్షాలుకురుస్తాయని విశాఖ, హైదరాబాద్ భారత వాతావరణ విభాగాలు ఆదివారం వేర్వేరుగా వెల్లడించాయి.
గడచిన 24 గంట ల్లో అనంతపురం జిల్లా మడకశిరలో 4 సెం. మీ,ప్రకాశం జిల్లా మారిపూడి, విజయనగరం జిల్లా శృంగవరపుకోట, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, అనంతపురం జిల్లా ధర్మవరం, తాడిమర్రిలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గడచిన 24 గంటల్లో విశాఖ జిల్లా మాడుగులలో 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అచ్యుతాపురంలో 14.4 మిల్లి మీటర్ల వర్షపాతం కురిసింది. ఒడిశా-దక్షిణ తమిళనాడు మధ్య ఏపీ కోస్తా తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం బలపడిందని వివరించింది.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..
భారీ వర్షాలు, పిడుగు పాటు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది మృతి చెందడం, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు.
వర్షాల మృతులకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా: సీఎం
భారీ వర్షాలు, పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. భారీ వర్షాలు, పిడుగుపాటుకు గురైన మృతుల కుటుంబాలకు జిల్లాల సోమవారమే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఇందుకు జిల్లాల అత్యవసర నిధులు వాడుకోవాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.