
సాక్షి, హైదరాబాద్: వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకో వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. గత నెల వరదలపై అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 22వ తేదీ వరకు సమయం ఇస్తున్నామని స్పష్టం చేసింది.
అయితే, ఇటీవలి వరద కారణంగా మోరంచపల్లెలో మృతి చెందిన మహాలక్ష్మి, సంజీవయ్య పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చలేదని పిటిషనర్ పేర్కొనగా, ఈ ఇద్దరు కూడా వరద కారణంగానే మృతి చెందితే, వారి వివరాలనూ అఫిడవిట్‌లో వెల్లడించాలని చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)లో న్యాయ వాది చిక్కుడు ప్రభాకర్ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గరువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ నెల 18 నుంచి 22 వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చర్యలు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని చిక్కుడు ప్రభాకర్ కోరారు.
ఇది కూడా చదవండి: రైతు బంధు పక్కదారి!
Comments
Please login to add a commentAdd a comment