కెప్టెన్సీ లేకుండా తొలిసారి బరిలోకి..
టీమిండియాకు గానీ, తన ఐపీఎల్ జట్టుకు గానీ అద్భుతమైన సారథిగా పేరు గడించిన మహేంద్ర సింగ్ ధోనీ.. తొలిసారి కెప్టెన్సీ లేకుండా ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. తర్వాత ఆ జట్టు రద్దు కావడం, ధోనీ పుణె జట్టుకు వెళ్లడం తెలిసిందే. అయితే.. గురువారం ముంబై ఇండియన్స్ జట్టుకు, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుకు మధ్య పుణె ఎంసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌గా కాకుండా కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ పదో సీజన్లో ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ పగ్గాలను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు అప్పగించాలని ఆర్పీఎస్ యాజమాన్యం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. దాంతో సుమారు దశాబ్దం తర్వాత ఐపీఎల్లో కెప్టెన్సీ లేకుండా ధోనీ బరిలోకి దిగుతున్నాడు.
జట్టు ప్రయోజనాల కోసమే స్మిత్‌కు పగ్గాలు అప్పగించినట్లు పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. తమకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని ఆయన చెప్పారు. మీడియా ఏం రాసినా, సోషల్ మీడయా ఏమనుకున్నా తనకు సంబంధం లేదని, అందరి అభిప్రాలను గౌరవిస్తూనే జట్టు ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తప్పనిసరి అవుతాయని అన్నారు.
కెప్టెన్‌గా కూడా ధోనీ బ్యాటింగ్ రికార్డు బాగానే ఉంది. గత 9 సీజన్లలో మొత్తం 143 మ్యాచ్‌లు ఆడి 3271 పరుగులు చేశాడు. మొత్తం 16 సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ పగ్గాలు వదిలిపెట్టి, స్మిత్ సారథ్యంలో ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్సీ భారం కూడా లేదు కాబట్టి హాఫ్ సెంచరీల స్థానంలో సెంచరీ వర్షం కురిపిస్తాడేమో చూడాల్సి ఉంది.