raithu dharna
-
రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
సీమ నుంచి 10 లక్షల మంది వలసెళ్లారు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చి..రైతులను ఆదుకోవాలి రైతుధర్నాలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి బెళుగుప్ప : వరుస కరువులతో సతమతమవుతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం బెళుగుప్ప తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానిక సర్పంచ్ రామేశ్వరరెడ్డి అధ్యక్షతన రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటని గుర్తు చేశారు. జిల్లా సాధారణ వర్షపాతం 520 మిల్లీమీటర్లు కాగా, గత ఏడాది 250 మి.మీ మాత్రమే నమోదైందన్నారు. దీనివల్ల నల్లరేగడి భూముల్లో విత్తనం కూడా పడలేదన్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికే రాయలసీమ నుంచి పది లక్షల మంది వలసలు వెళ్లారన్నారు. వారిని ఆదుకోకపోగా, అధిక ఆదాయం కోసమే వెళుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎక్కడైనా ఫ్యాక్టరీలకు నష్టం జరిగితే రూ.కోట్ల బీమా చెల్లిస్తారు గానీ, పంట నష్టపోయే రైతులకు మాత్రం ప్రీమియం కూడా తిరిగివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో పంట రుణాలు రెన్యూవల్ చేయించలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. వారు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన మిర్చి, వేరుశనగ, పసుపు, చీనీ, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీ-నీవా మొదటిదశ కింద డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి ఉరవకొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని, ఊటనీటితో ఇబ్బందులు పడుతున్న జీడిపల్లి వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రైతు ధర్నాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బెళుగుప్ప మండల కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దుద్దేకుంట రామాంజినేయులు, మండల మహిళా అధ్యక్షురాలు అంకంపల్లి యశోదమ్మ, ఎర్రగుడి సర్పంచ్ అనిత, మండల ప్రధాన కార్యదర్శ అశోక్, ఎస్సీసెల్ కన్వీనర్ తిప్పేస్వామి, రైతు విభాగం నాయకులు భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, మచ్చన్న, నంజుండప్ప, రవీంద్ర, కేసీ తిప్పేస్వామి, శ్రీశైలప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్
– గొల్లపల్లి ప్రాజెక్టు వైఎస్ ఘనత – రైతు ధర్నాలో జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ పరిగి : రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ప్రకటించకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. రైతులకు ఇంత వరకూ ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై శుక్రవారం పరిగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న కరువును శాశ్వతంగా పారద్రోలేందుకు నడుం బిగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం వల్లే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ పేర్కొన్నారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న కరువును శాశ్వతంగా పారద్రోలడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం వల్లే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయిందన్నారు. హంద్రీ–నీవా కాలువ పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం తూతూ మంత్రంగా నీరు తెప్పించి మొత్తం తామే సాధించినట్లుగా గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని సవాల్ విసిరారు. జిల్లాలో సుమారు 10లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే అరకొరగా రుణమాఫీ జరిగిందన్నారు. జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారందరికీ ధైర్యాన్ని నింపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారన్నారు. కానీ, టీడీపీ నాయకులు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకే అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రుణాలను కూడా జన్మభూమి కమిటీల్లో రాబందుల్లా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. కుమారుడిపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును కాజేస్తుంటే కంచే చేను మేసిన చందంగా ఉందని, ఇక రైతాంగాన్ని ఎలా కాపాడుతారన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సుబ్బారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పరిగి మండల కన్వీనర్ జయరాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వర్‌రావు, అరుణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, మూర్తి, బాలు, మోహన్, నాగేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ శంకరప్ప, మహిళా నాయకురాలు చౌడమ్మ, కిరణ్, మల్లికార్జున, తిమ్మారెడ్డి, రామాంజి, హర్షారెడ్డి, మల్లికార్జున, అనిల్, నరేష్, శివ, గణేష్, వెంకటేష్, ఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు.