'రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం'
ఆర్కేపురం (రంగారెడ్డి): రైతు, వినియోగదారుల కోసమే మార్కెటింగ్‌శాఖ పనిచేస్తుందని, రైతు లేనిదే మార్కెట్, కమిషన్ ఏజెంట్లు ఉండరని, రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వ్యవసాయ మార్కెట్లోని గడ్డిఅన్నారం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్లో రూ. 2.60కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ భవనాన్ని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 'రైతులకు, ఏజెంట్లకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మార్కెటింగ్ శాఖ పని చేస్తుంది. ఏదైనా సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకువస్తే విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటాం. మార్కెట్లో ఫిర్యాదుల కోసం బాక్సు, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మార్కెట్లో తెల్లచిట్టీలతో వ్యాపారం చేయవద్దు. ఎలక్ట్రానిక్ వే మిషన్స్ వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెట్లో ఇంకా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్నగర్ మార్కెట్లో చిరు వ్యాపారులకు షెడ్లు కట్టిస్తాం. మార్కెట్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలి' అని సూచించారు.
రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధర ఎంత ఉన్న ప్రభుత్వం భరిస్తుందని, రూ. 20లకు కిలో ఉల్లిగడ్డలు అందిస్తామని పేర్కొన్నారు. నగరంలో 46సెంటర్లను ఏర్పాటు చేశామని, అవసరమైతే మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీ ఇతర సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు.