జన్వాడ కేసు: 8 గంటల పాటు ప్రశ్నించి.. రాజ్ పాకాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జన్వాడ కేసులో రాజ్‌పాకాల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆయనను జన్వాడ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. మరోసారి జన్వాడ నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం రాజ్ పాకాలను మళ్లీ మోకిల పీఎస్‌కు తీసుకెళ్లి విచారించిన పోలీసులు.. 35(3) బీఎంఎస్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. సుమారు 8 గంటల పాటు విచారించారు. విజయ్ మద్దూరి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.కాగా, రాజ్ పాకాల తన అడ్వకేట్‌తో పాటుగా మోకిలా పీఎస్‌కు వచ్చారు. రాజ్ పాకాలకు మంగళవారంతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. మంగళవారం కూడా రాత్రి విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు.ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. కాగా, బుధవారం రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు.