ఎంతటివారైనా వదిలిపెట్టం
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎంత పలుకుబడి ఉన్నవారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు తెలిపారు. మంగళవారం అర్బన్ ఎస్పీ తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో క్రైం మీటింగ్ నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు యువ ఎస్ఐలతో 10 టీమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పుడున్న చెక్‌పోస్టులతో పాటు మరికొన్ని చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరెవరి ప్రమేయం ఉందో దర్యాప్తు చేయాలని, వారిందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా అదుపులోకి తీసుకోవాలని అన్నారు. సార్వత్రిక, మున్సిపల్, స్థానికసంస్థల ఎన్నికల బందోబస్తులో సమర్థవంతంగా విధులు నిర్వహించడం పట్ల అధికారులందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు. ఇక పాత కేసులపై దృష్టి సారించాలని, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఓఎస్డీలు రాజశేఖరరావు, చాందేనాయక్, సిద్ధారెడ్డి, డీఎస్పీలు రవిశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, టంగుటూరి సుబ్బన్న, ఎంవీయస్ స్వామి, విమలాకుమారి, అభిషేకం, శ్రీనివాస్ రాజేంద్రప్రసాద్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.