కిడ్నీ మార్పిడిలో ‘కేర్’ 95% విజయవంతం
సాక్షి, హైదరాబాద్: మూత్ర పిండాల మార్పిడిలో తమ వైద్య బృందం 95 శాతం విజయం సాధించినట్లు కేర్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం డెరైక్టర్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి పేర్కొన్నారు. దేశంలోనే 500 మూత్ర పిండాల మార్పిడి చేసిన ఘనతను కేర్ ఆసుపత్రి సాధించిందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2004లోనే మార్పిడి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి తక్కువ కాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో తాము అగ్రగామిగా ఉన్నామన్నారు.
దేశంలోని వివిధ కేర్ ఆసుపత్రుల్లో మూత్రపిండాల మార్పిడి చేశామని.. ఒక్క హైదరాబాద్ కేర్‌లోనే 300 చేసినట్లు పేర్కొన్నారు. జీవదాతలు, బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మూత్రపిండాలు సేకరించి బాధితులకు మార్పిడి చేసి మంచి ఫలితాలు సాధించామన్నారు. పరస్పర అవగాహనతో ఇద్దరు బాధితుల కుటుంబాల నుంచి కిడ్నీలు సేకరించి ‘స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్’కు కేర్ ఆసుపత్రి దక్షిణ భారత దేశంలో మొదటిసారిగా శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ట్రాన్స్‌ప్లాంట్ విభాగం సర్జన్లు డాక్టర్ కె.రామరాజు, డాక్టర్ బీవీ రామరాజు పాల్గొన్నారు.