Rajamahendravaram City Assembly Constituency
-
చంద్రబాబుకు మతిభ్రమించింది
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబుకు మతిభ్రమించడంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజమహేంద్రవరం రాగానే జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. ఇతరులపై బురద జల్లడం మాని ముందు ఆయన పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉన్నవి, లేనివి కల్పించి, వైఎస్సార్సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయోగం చేస్తున్నారని, చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బాబు చిప్ అరిగిపోయింది: ఎంపీ మార్గాని చంద్రబాబుకు చిప్ అరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ విమర్శించారు. సోమవారం చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏనాడైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న బాబు జైలు కిటికీల్లోనుంచైనా అభివృద్ధి చూడాలి కదా... అని వ్యంగ్యాస్త్రం సంధించారు. లోకేశ్‌ను రాజమహేంద్రవరంలో పోటీకి దింపితే ప్రజలు చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధిలో బాబు తన హయాంలో సగం చేసినట్లు నిరూపించినా తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మార్గాని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. -
రా... కదలిరాలో కిందపడబోయిన చంద్రబాబు.. ఆగ్రహం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కోపమొచ్చింది. రాజానగరం టికెట్ కేటాయింపు అసంతృప్తి సెగలు ఆయనకు తగిలాయి. ఈ క్రమంలో రాజమండ్రి రూరల్ కాతేరులో సోమవారం ఆయన నిర్వహించిన రా కదలి రా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాజానగరం టికెట్ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదేం తీరు తమ్ముళ్లూ.. అంటూ సొంత పార్టీ కార్యకర్తల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
టీడీపీకి ‘తూర్పు’ సెగ
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా రాజోలు, రాజానగరం సీట్ల పంచాయితీ శనివారం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఆ రెండు సీట్లలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడి టీడీపీ నేతలు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని ముఖ్య నేతలను నిలదీశారు. రాజోలు టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో చంద్రబాబు లేకపోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారితో మాట్లాడారు. రాజానగరం నేతలు అచ్చెన్నకు వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు త్వరలో రాజానగరం, రాజోలు నాయకులతో మాట్లాడతారని అచ్చెన్న సర్దిచెప్పారు. కార్యకర్తలు వినకపోవడంతో తర్జనభర్జన తర్వాత అధిష్టానం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ రెండు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు నిరసన తెలిపారు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో అచ్చెన్న వెళ్లిపోయారు. కార్యకర్తలు కూడా కొద్దిసేపు ఉండి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. రాజాన‘గరం’ రాజానగరం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలి ఆది నుంచీ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై గతంలో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశా వ్. అధికారంలో ఉండగా అనుభవించి, ఇప్పుడు గాలికి వదిలేస్తావా?’ అంటూ విరుచుకుపడ్డారు. బాబు వ్యవహార శైలితో విసుగు చెందిన పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పదవికి గుడ్‌బై చెప్పారు. ఆయన తర్వాత నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ దుకాణం కొన్నాళ్లు బంద్ అయింది. పెందుర్తి కి అప్రధాన పదవి అప్పగించారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనంతరం బొడ్డు వెంకట రమణ చౌదరిని నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. రాజానగరం టికెట్ తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ చౌదరి ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలో పవన్ ప్రకటనతో చౌదరి వర్గంలో ఆగ్రహం పెల్లుబికింది. రాజానగరం టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడికి ఇచ్చిన వినతిపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫేక్ అని ప్రచారం చేసేందుకు టీడీపీ నేతలు తంటాలు పడుతున్నారు. -
‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. ఎమ్మెల్యే సీటు నాదంటే నాదంటూ బాహాటంగా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంబిస్తూ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన బాబు స్వపక్ష నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలను చక్కదిద్దలేక చేతులెత్తేశారు. దీనికి తోడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న మీమాంస నెలకొంది. ఆది నుంచీ ఉన్న వారికి భంగపాటు తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిడదవోలులో ‘సోషల్’ వార్ నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై స్వపక్షంలో అయోమయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, టీడీపీ నేత కుందుల సత్యనారాయణలు సీటు కోసం నువ్వా నేనా? అనే రీతిలో చక్రం తిప్పుతున్నారు. అధినేత ప్రసన్నం కోసం ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో వార్‌కు దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా నాయకుడే ఎమ్మెల్యే అవుతాడని ఇరు వర్గాలూ పోస్టులు పెడుతూండటంతో ద్వితీయ స్థాయి నాయకులు ఎవరి వెంట నడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తనకే కేటాయించాలని టీడీపీ అధిష్టానానికి కుందుల సత్యనారాయణ భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు జనసేన నుంచి మరో ముగ్గురు బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌తో పాటు తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తుండగా.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ సైతం రేసులో ఉన్నారు. పొత్తులో భాగంగా నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని, తామే పోటీ చేస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతల్లో మింగుడు పడటం లేదు. గోపాలపురం.. గందరగోళం గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. ఆది నుంచీ పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో మద్దిపాటి వెంకట్రాజును బాబు నియమించారు. కనీస సమాచారం లేకుండా ఎందుకు మార్చారని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది. వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీ చేస్తారని బాబు ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాల అగ్గి మరింతగా రాజుకుంది. అప్పటి నుంచీ ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజికవర్గ నేతలు టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోగా తాడోపేడో తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద బలప్రదర్శనకు దిగుతున్నారు. కొవ్వూరులో ఎస్సీలకు అవమానం ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన కొవ్వూరులో ఆ సామాజిక వర్గాలకు ఘోర అవమానం ఎదురవుతోంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి, తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబుకు అందలం వేయడం.. జవహర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కొవ్వూరు అభ్యర్థిత్వం తనదేనంటూ చెప్పుకుంటూండటంతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి. రాజానగరం.. గరంగరం రాజానగరంలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే సీటు తనకే వరిస్తుందని జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధిష్టానానికి భారీ స్థాయిలో పార్టీ ఫండ్ ఇచ్చారని.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామం ఇప్పటికే రాజానగరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గంలో అగ్గి రాజేస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని, జనసేనకు టికెట్ ఇస్తారన్న ప్రచారం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరోవైపు బొడ్డు వెంకట రమణ చౌదరిని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గం ఇప్పటికే పార్టీ అధినేతపై గరంగరంగా ఉంది. ఒకవేళ టీడీపీకే ఈ సీటు కేటాయించినా ఇటు పెందుర్తి వర్గం, అటు జనసేన శ్రేణులు వెంకట రమణ చౌదరికి జెల్ల కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలా కాదని జనసేనకే కేటాయించినా ఆ పార్టీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపించడం లేదు. రాజమహేంద్రవరం రూరల్‌లో తేలని పంచాయితీ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై టీడీపీ – జనసేన మధ్య నెలకొన్న పంచాయితీ నేటికీ కొలిక్కి రావడం లేదు. పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ చెబుతూండగా.. తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఇతరులెవరికైనా ఉందా? తానే పోటీ చేస్తానని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆజ్యం పోస్తోంది. -
సీనియర్ నేతకు పొగ పెడుతున్న బాబు.. ఆ నియోజకవర్గం ఎంటీ?
గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్‌కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి. చదవండి: ‘మోసానికి, అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్’