గోదావరి జిల్లాల్లో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చ పార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటినుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన, టీడీపీల్లో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీయే. అయితే టీడీపీ, జనసేన సీటు ఆశిస్తున్న ఇద్దరూ పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.
రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ, జనసేన అభ్యర్ధులు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ- జనసేన పార్టీలు అసలీ స్థానానికి ఎవరిని అభ్యర్ధిగా ప్రకటిస్తారోనని రెండుపార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్ధులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెపుతున్నా, తామే అభ్యర్ధులమంటూ క్యాడర్కు బహిరంగంగానే చెపుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున ఆరుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదిరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏ మాత్రం అన్యాయం జరిగిందని భావించినా, వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావాల్సినంది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటం బుచ్చయ్య చౌదిరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్ధిని చెపుతున్నా, కచ్చితంగా ఈస్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడుపడటంలేదు.
రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందులు దుర్గేష్ ఎప్పటినుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి పదిరోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీచేస్తానంటూ చెపుతున్నారు. టిక్కెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటుంటుందని, దీనికోసం ఎంతటివారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదిరికి సంకేతాలిస్తున్నారు.
అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇపుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటిరోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి, తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టిక్కెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్ధంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ, ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెపుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా జలక్ ఇస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చేవరకేనంటున్న బుచ్చయ్య చౌదిరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టిక్కెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment