నెల్లూరు జైలుకు చెవిరెడ్డి తరలింపు
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపక్ష సభ్యులపై కక్షసాధింపు ధోరణి కొనసాగిస్తోంది. ఇప్పటికే అరెస్టైన నాయకులపై అక్రమ కేసులు భానాయించి మరీ అరెస్ట్లు చేస్తుంది. రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు విచారణ పేరుతో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రికి తరలించారు.
శనివారం సాయంత్రం మూడో అడిషినల్ జ్యుడిషయల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో నమోదైన కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు తిరిగి చెవిరెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో అనైతిక పాలన కొనసాగుతుందన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో గత సోమవారం చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత మరో కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.