Rajarajeswari Temple
-
అమ్మవారి ఆభరణాలు భద్రం
నెల్లూరు(బృందావనం) : నగరంలోని కరెంటాఫీస్ సెంటర్ సమీపంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మాయమైన నగలు ఎట్టకేలకు అమ్మవారి చెంతకు చేరాయి. ఆలయ అర్చకులు, పరిచారికల నుంచి ఆ నగలు మళ్లీ అమ్మవారి ఆలయంలో భద్రపరచనున్నామని దేవాదాయ, ధర్మాదాయశాఖ నెల్లూరు సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి, దేవస్థానం ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, బదిలీపై వెళ్లిన సింగరకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న పులి కోదండరామిరెడ్డి తెలిపారు. నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబం ధించి వివరాలను దేవాదాయ, ధర్మాదాయశాఖ నెల్లూరు సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి వెల్లడించారు. గత నెల 25వ తేదీన ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి, గతంలో పనిచేసిన కార్యనిర్వహణాధికారి పులి కోదండరామిరెడ్డి ఆభరణాలు అప్పగించేందుకు గుంటూరుకు చెందిన జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి మాధవి పరిశీలన చేశారు. ఆ సమయంలో అమ్మవారికి చెందిన కాంట్రాక్ట్ పరిచారిక ఎ.దిలీప్‌కుమార్, కాంట్రాక్ట్ అర్చకుడు వి.నరసింహారావు చెంత నుంచి 147 గ్రాముల కలిగిన సుమారు రూ.3,67,500 విలువజేసే 110 బిల్వపత్రాలు, 225 గ్రాముల కలిగిన సుమారు రూ.5,58,800 విలువ కలిగిన ఎరుపురంగురాళ్లతోగల 73 çపూలు, 107 చిన్న పూలు, కాంట్రాక్ట్ పరిచారిక కె.హరికృష్ణ నుంచి 48 గ్రాముల కలిగిన 110 తెలుపు, స్టోన్స్, ఒక పెద్ద ఎరుపుస్టోన్, 39 ఎరుపురాళ్లు కలిగిన సుమారు రూ.95వేలు విలువచేసే ఆభరణాలు కనిపించకుండా పోయాయన్నారు. అయితే ఆ ఆభరణాలు ఎక్కడకూ పోలేదని తమ వద్దనే భద్రంగా ఉన్నాయని దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారయంత్రాంగం స్పష్టం చేసింది. అమ్మవారి నగలు భద్రంగానే ఉన్నాయని భావించామన్నారు. అమ్మవారి ఆభరణాలు కనిపించకుండాపోవడంపై అన్ని వర్గాల నుంచి పలు అనుమానాలు తలెత్తాయన్నారు. ఆ అనుమానాలు నివృత్తి చేసేందుకు తాము నగలను పరిశీలించామన్నారు. ఈ నగలు వారం రోజుల క్రితం ఆలయంలోని ఆభరణాల చెంతనే తమ పరిశీలనలో ఆభరణాలు ఉన్నాయనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారం రోజుల క్రితం ఈ విషయాన్ని బదిలీపై వెళ్లిన పులి కోదండరామిరెడ్డికి తెలిపామన్నారు. ఆయన సింగరకొండ ఆలయంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో వీలుచూసుకుని ఆదివారం రావడంతో ఈ నగలను కోదండరామిరెడ్డి సమక్షంలో ఆయన ద్వారా ప్రస్తుత ఆలయ కార్య నిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి అప్పగించామన్నారు. ఇకపై ఎటువంటి పొరపాట్లు, సందేహాలకు తావివ్వకుండా అమ్మవారికి సంబంధించిన అన్ని ఆభరణాలను సమగ్ర సమాచారంతో రిజిస్టర్లలో నమోదుచేస్తామన్నారు. బదిలీపై వెళుతున్న అధికారుల నుంచి సర్వీసులో ఉండడం వల్ల వారి నుంచి పూర్తి అప్పగింతలు పరిపాలనాపరంగా జరగవన్నారు. అధికారి ఉద్యోగ విరమణ చేస్తే ఆయన నుంచి అప్పగింతలన్నీ నిబంధనల మేరకు జరుగుతాయని వేగూరు రవీంద్రరెడ్డి వివరించారు. పరిశీలనలో వెలుగుచూశాయి ప్రస్తుతం నేను సింగరకొండ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్నా. గత నెలలో జ్యూయలరీ వెరిఫికేషన్ సమయంలో నగలు కనిపించకపోవడంతో నేను ప్రస్తుత కార్యనిర్వహణాధికారికి నగలను అప్పగించలేకపోయా. దేవాదాయ, ధర్మాదాయశాఖ నిబంధనల మేరకు నగలు చూపించలేకపోయిన పరిచారికలకు నోటీసులు ఇచ్చాం. నోటీసులు అందుకున్న పరిచారికలు తిరిగి పరిశీలనచేసిన సమయంలో నగలు కనిపించాయన్న విషయాన్ని నాకు వారం రోజుల క్రితం తెలిపారన్నారు. మా దేవస్ధానంలో జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆదివారం వెసులుబాటుచూసుకుని నెల్లూరుకు వచ్చి ప్రస్తుత కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డికి అప్పగించా. –కోదండరామిరెడ్డి, బదిలీపై వెళ్లిన కార్యనిర్వహణాధికారి రిజిస్టర్ మెయిన్‌టెయిన్ చేస్తాం అమ్మవారి నగలు నాగు అప్పగించారు. ఇకపై ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఆభరణాలకు సంబంధించిన అన్ని విషయాలను రిజిస్టర్‌గా మెయిన్టెయిన్చేస్తాం. నగలను లాకర్లో భద్రపరుస్తున్నాం. అమ్మవారి నగలు కనిపించడం తిరిగి అమ్మవారి చెంతకు చేర ఆనందంగా ఉంది. –వెండిదండి శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం -
శిరమున శివుని ధరించిన విజయ రాజరాజేశ్వరి
ఎక్కడయినా సరే, శివుడి శిరస్సున గంగమ్మ ఉండటమే చూస్తాం కానీ, అమ్మవారి శిరస్సుమీద శివుడుండటం ఎక్కడైనా చూశారా? అలాగే, అక్షరాలకు ఆలయాలు కట్టి మరీ ఆరాధించడం ఎక్కడైనా చూశారా? స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు, పచ్చటి పంటపొలాలకు చేరువలో ఉన్న అతి సుందరమైన ఆలయాన్ని వీక్షించాలంటే కృష్ణాజిల్లాలోని పెదపులిపాక గ్రామానికి వెళ్లవలసిందే. విజయవాడ సమీపంలోని యనమలకుదురు మీదుగా కట్ట మీద నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెద్దపులిపాక గ్రామం స్వాగతం పలుకుతుంది. ఒక వైపు ఎర్రటి నీటితో నిండుగా పరుగులు తీస్తున్న కాలువ. కాలువకు ఆవల కృష్ణమ్మ, మరో పక్క ఠీవిగా తలలు ఎత్తుకుని నిలబడిన చెరుకు తోటలు. ఈవల శ్రీవిజయ రాజరాజేశ్వరి దేవాలయం. మనసుకి ఆహ్లాదాన్ని, భక్తిని ప్రసాదించే ప్రశాంత వాతావరణంలో శ్రీవిజయరాజరాజేశ్వరి దేవాలయ నిర్మాణం కన్నులపండువగా ఉంటుంది. పరమహంస పరివ్రాజకులు వాసుదేవానందగిరి స్వామివారి కృషితో పూర్తిగా దక్షిణాది శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశంలోనే విలక్షణమైనది. అమరలింగేశ్వరుడికి, బెజవాడ కనకదుర్గకు మధ్యన కృష్ణానదీ తీరంలోని పెద్దపులిపాక గ్రామంలో కొలువు తీరి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో... విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే‘విజయగణపతి’, సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే ‘విజయ సరస్వతీదేవి’, ఐశ్వర్యాలను సమకూర్చే ‘విజయలక్ష్మి’, సకల కార్యసిద్ధిని ప్రసాదించే ‘విజయ ఆంజనేయస్వామి’ మూర్తులను దర్శించుకోవడం పుణ్యదాయకం. దేవాలయ నలుదిక్కులా నాలుగు వేదాలకు ప్రతీకగా ఎత్తయిన రాజగోపుర ద్వారాలు స్వాగతం పలుకుతాయి. ఆలయానికి వాయవ్యంగా గోశాల, ప్రాకార మండపంలో శాలాహారంలో ‘అ’ నుండి ‘క్ష’ వరకు గల అక్షర దేవతలు, లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఏకశిలా విగ్రహం... ఇక్కడి దేవి పేరు శ్రీవిజయరాజరాజేశ్వరి. అమ్మవారి శిరస్సు మీద లింగాకారం ఉంటుంది. పరమశివుడు గంగను తన శిరస్సు మీద ధరిస్తే, అమ్మవారు సాక్షాత్తు అయ్యవారిని తన శిరస్సున ధరించి కనువిందు చేస్తుంది. తల మీద ఉన్న అయ్యవారి కోసం సోమవారం, అమ్మవారి కోసం శుక్రవారం అభిషేకాలు జరిపిస్తారు. ఇది ఇక్కడి విలక్షణత. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అక్షర దేవతల్ని విగ్రహరూపంలో వాయుప్రతిష్ఠ చేశారు. దశావతారాలు, నవదుర్గలు, దశమహావిద్యల విగ్రహాలను జైపూర్‌లో చేయించారు. ప్రస్తుతం పౌర్ణమి నాడు మాత్రం అన్నదానం జరుగుతోంది. అక్షరదేవతలు... ఆలయంలోకి ప్రవేశిస్తుండగానే నలుదిక్కులా నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఎత్తయిన రాజగోపుర ద్వారాలు స్వాగతం పలుకుతాయి. ప్రాకార మండపంలో శాలాహారంలో ‘అ’ నుండి ‘క్ష’ వరకు గల అక్షర దేవతలు అక్షరభిక్ష పెడతాయి. ఎక్కడా లేని విధంగా అక్షర దేవతల్ని ఇక్కడ విగ్రహరూపంలో వాయుప్రతిష్ఠ చేశారు. ఆలయ లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు పురాణజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా నీలి సరస్వతి, చిన్నమస్తాదేవి వంటి విలక్షణ దేవతల రూపాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆలయానికి వాయవ్యంగా గోశాలలో గోమాతలు పవిత్రతతో మూర్తీభవిస్తాయి. గోశాల కుడ్యాల మీద కొలువుతీరిన అష్టలక్ష్ములు, శ్రీకృష్ణుడు భక్తిభావనలను కలిగిస్తాయి. త్వరలో ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠాపన కూడా జరగబోతోంది. ప్రతిష్ఠాపన... ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన 2016 ఫిబ్రవరి మాసంలో జరిగింది. మహాబలిపురంలోని ఒక పేరెన్నికగన్న శిల్పి ఈ విగ్రహాన్ని నల్లని ఏకశిలలో మూడు మాసాలు శ్రమించి రూపొందించారు. ఈ ఆలయంలో అడుగుపెడితే అంతా విజయమేనని భక్తుల విశ్వాసం. – డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ ఆలయ వేళలు ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, సాయంత్రం 5 గం. నుంచి రాత్రి 8 గం. వరకు రైలు మార్గం: విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషనులు. బస్సుమార్గం: విజయవాడ, గుంటూరు బస్సు స్టాండుల నుంచి యనమలకుదురు వరకు వస్తే... అక్కడి నుంచి ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు. యనమలకుదురు నుంచి కేవలం మూడు కిలోమీటర్లున్న ఈ గుడిని సొంత వాహనదారులు వారి వారి వాహనాల మీద అతి సులువుగా చేరుకోవచ్చు. దేవాలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలంటే, మరింత శ్రద్ధాభక్తులతో దేవాలయాన్ని పరిరక్షించాలి. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల ప్రతిమలు, దశావతారాల ప్రతిమలను కూడా అద్దాలతో పరిరక్షిస్తే విగ్రహాల పవిత్రత నిలబడుతుంది. ప్రతిమలను మరింతకాలం అందంగా చూసుకునే అవకాశం ఉంటుంది. దేవాలయంలో జరిగే సేవలు, పూజలు తదితర నిత్య కైంకర్యాల వంటివాటిని పవిత్రంగా ఆచరిస్తే, ఈ దేవాలయానికి మరింత పవిత్రత చేకూరుతుంది. ఇంకా నగర వాసనలు అంటని, పచ్చిగా ఉన్న పచ్చని పల్లెసీమ గాలులలో ఉన్న ఈ దేవాలయం ఆధ్యాత్మికతకు నిలయంగా నిలుస్తుంది. యనమలకుదురు, చోడవరం, తాడిగడప, పెనమలూరు ప్రాంతాలు సరిహద్దులుగా వెలసిన ప్రాంతం పెద్దపులిపాక. గ్రామానికి మధ్యన ఉన్న ‘చిన్నచెరువు’ ఆ గ్రామ ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ కాపాడుతోంది. పక్కనే ప్రవహిస్తున్న కాలువ... పంటలకు నీటిసదుపాయం కలిపిస్తోంది. విజయవాడ సమీపంలోని యనమలకుదురు కట్ట మీదుగా మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెద్దపులిపాక గ్రామం. -
పవిత్ర కలశాలతో నగరోత్సవం
నెల్లూరు(బృందావనం): శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులు 1016 పవిత్ర పెన్నానది జలాల కలశాలతో శనివారం రాత్రి నగరోత్సవాన్ని నిర్వహించారు. పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని పెన్నానది నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి మాలధారణ చేసిన సుమారు 1600 మందికిపైగా భక్తులు పవిత్ర జలాలను సేకరించి ఊరేగింపుగా సాగారు. పాతమున్సిపల్ ఆఫీస్ నుంచి సంతపేట, ఏసీ సెంటర్, గాంధీబొమ్మ, మీదుగా రాజరాజేశ్వరి ఆలయం వరకు నగరోత్సవం సాగింది. చండీ, భవానీ, గాయత్రి, అన్నపూర్ణ, గజలక్ష్మి, మహాలక్ష్మి, కాళిక, సరస్వతి, దుర్గ అలంకారాలను ప్రత్యేక వాహనాల్లో కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారి నామస్మరణతో కోలాహలంగా సాగింది. అమ్మవారికి అభిషేకం సోమవారం జరగనుందని పెంచలరెడ్డి తెలిపారు. మూలస్థానేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ ఆల్తూరు గిరీష్‌కుమార్‌రెడ్డి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ కొలపర్తి వెంకటరమేష్, తదితరులు పాల్గొన్నారు. -
రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు
నెల్లూరు(బృందావనం): కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పులి కోదండరామిరెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది జూలై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు భక్తులు రూ.14,62,619 మొత్తాన్ని సమర్పించారన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్, ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ, తదితరులు పాల్గొన్నారు. -
భక్తులే వీఐపీలు
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు(బృందావనం): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో శనివారం రాత్రి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు, నాయకులను కోరారు. ఆలయ పరిసరాల్లో నాయకులు, వారి అనుయాయులు భారీఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం విరమించుకోవాలని సూచించారు. ఆలయం రూరల్ పరిధిలో ఉన్నందున ప్రొటోకాల్ ప్రకారం తనకు అగ్రతాంబూలం దక్కుతుందని, అయితే మహిళలు, చంటిబిడ్డల తల్లులు.. ఇతర సందర్శకులకు ఇక్కట్లు కలగకుండా ఉండేందుకు తాను ప్రొటోకాల్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. సామన్యుడిలా క్యూలైన్లోనే అమ్మవారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. గంటల తరబడి వేచిచూసే యాతన నుంచి భక్తులను తప్పించేందుకు తన బాటలోనే ప్రముఖులు పయనించాలని కోటంరెడ్డి కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా ఆలయ పరిసరాల్లో ఏసీ స్టేడియం నుంచి కరెంటాఫీస్ సెంటర్ వరకు రాజకీయనాయకులకు చెందిన ఫ్లెక్సీల ఏర్పాటు జరగదన్నారు. కాగా, అక్టోబరు 1 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కోటంరెడ్డి సూచించారు. ఇటీవలికాలంలో ఆలయగోపురంపై అగంతకుడు ఎక్కడం, అగ్నిప్రమాదం సంభవించడం లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం అరిష్టమన్నారు. ప్రధానంగా ఆలయ నిర్వాహకుల తీరుతెన్నులు, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. క్యూలైన్ల ఏర్పాటు, దర్శనం తదితర విషయాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విస్తృత ఏర్పాట్లు: మంత్రి నారాయణ 42వ శరన్నతరాత్రి ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణ పుష్కరాలు, వెంకటగిరి పోలేరమ్మ జాతర, బారాషహీద్‌దర్గా రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో అధికారులను సమన్వయం చేసి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేస్తామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలకు చెందిన అ«ధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, భక్తులకు శానిటేషన్ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ వివరించారు. ఇదిలా ఉండగా, ఆలయ కార్యనిర్వహణాధికారిగా కోదండరామిరెడ్డి పనికిరాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఈఓ తీరువల్ల భక్తులు ఎన్నో అవస్థలుపడ్డారని విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు ఆనం జయకుమార్‌రెడ్డి, రాజానాయుడు, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
రాజరాజేశ్వరి ఆలయానికి వెల్లువెత్తిన భక్తులు
మహేశ్వరం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి దేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు వెల్లువెత్తారు. దాదాపు 200ల మంది దేవాలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించగా, 2 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. -
వేములవాడఆలయంలో భారీవర్షం