పవిత్ర కలశాలతో నగరోత్సవం
నెల్లూరు(బృందావనం): శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ చేసిన భక్తులు 1016 పవిత్ర పెన్నానది జలాల కలశాలతో శనివారం రాత్రి నగరోత్సవాన్ని నిర్వహించారు. పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని పెన్నానది నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి మాలధారణ చేసిన సుమారు 1600 మందికిపైగా భక్తులు పవిత్ర జలాలను సేకరించి ఊరేగింపుగా సాగారు. పాతమున్సిపల్ ఆఫీస్ నుంచి సంతపేట, ఏసీ సెంటర్, గాంధీబొమ్మ, మీదుగా రాజరాజేశ్వరి ఆలయం వరకు నగరోత్సవం సాగింది.
చండీ, భవానీ, గాయత్రి, అన్నపూర్ణ, గజలక్ష్మి, మహాలక్ష్మి, కాళిక, సరస్వతి, దుర్గ అలంకారాలను ప్రత్యేక వాహనాల్లో కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారి నామస్మరణతో కోలాహలంగా సాగింది. అమ్మవారికి అభిషేకం సోమవారం జరగనుందని పెంచలరెడ్డి తెలిపారు. మూలస్థానేశ్వరస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ ఆల్తూరు గిరీష్‌కుమార్‌రెడ్డి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ కొలపర్తి వెంకటరమేష్, తదితరులు పాల్గొన్నారు.