భక్తులే వీఐపీలు
-
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు(బృందావనం): శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో శనివారం రాత్రి సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులే వీఐపీలని, వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులు, నాయకులను కోరారు.
ఆలయ పరిసరాల్లో నాయకులు, వారి అనుయాయులు భారీఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం విరమించుకోవాలని సూచించారు. ఆలయం రూరల్ పరిధిలో ఉన్నందున ప్రొటోకాల్ ప్రకారం తనకు అగ్రతాంబూలం దక్కుతుందని, అయితే మహిళలు, చంటిబిడ్డల తల్లులు.. ఇతర సందర్శకులకు ఇక్కట్లు కలగకుండా ఉండేందుకు తాను ప్రొటోకాల్‌ను వదులుకుంటున్నట్లు ప్రకటించారు. సామన్యుడిలా క్యూలైన్లోనే అమ్మవారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. గంటల తరబడి వేచిచూసే యాతన నుంచి భక్తులను తప్పించేందుకు తన బాటలోనే ప్రముఖులు పయనించాలని కోటంరెడ్డి కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ ఫ్లెక్సీల విషయంలో ఎమ్మెల్యే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రధానంగా ఆలయ పరిసరాల్లో ఏసీ స్టేడియం నుంచి కరెంటాఫీస్ సెంటర్ వరకు రాజకీయనాయకులకు చెందిన ఫ్లెక్సీల ఏర్పాటు జరగదన్నారు. కాగా, అక్టోబరు 1 నుంచి 11 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కోటంరెడ్డి సూచించారు. ఇటీవలికాలంలో ఆలయగోపురంపై అగంతకుడు ఎక్కడం, అగ్నిప్రమాదం సంభవించడం లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం అరిష్టమన్నారు. ప్రధానంగా ఆలయ నిర్వాహకుల తీరుతెన్నులు, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. క్యూలైన్ల ఏర్పాటు, దర్శనం తదితర విషయాల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
విస్తృత ఏర్పాట్లు: మంత్రి నారాయణ
42వ శరన్నతరాత్రి ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణ పుష్కరాలు, వెంకటగిరి పోలేరమ్మ జాతర, బారాషహీద్‌దర్గా రొట్టెల పండగను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో అధికారులను సమన్వయం చేసి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేస్తామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలకు చెందిన అ«ధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, భక్తులకు శానిటేషన్ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని మేయర్ అబ్దుల్ అజీజ్ వివరించారు.
ఇదిలా ఉండగా, ఆలయ కార్యనిర్వహణాధికారిగా కోదండరామిరెడ్డి పనికిరాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఈఓ తీరువల్ల భక్తులు ఎన్నో అవస్థలుపడ్డారని విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు ఆనం జయకుమార్‌రెడ్డి, రాజానాయుడు, నూనె మల్లికార్జునయాదవ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.