నేను కొనసాగాలా? తప్పుకోవాలా?
బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో గ్రూపిజం పెరిగిందంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా లేఖాస్త్రం సంధించారు. బీజేపీలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఉటంకిస్తూ పార్టీలో తాను కొనసాగాలా.. తప్పుకోవాలా అన్నది స్పష్టం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌లకు లేఖలు రాశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటట్లు పార్టీని అభివృద్ధి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించినా ఆ దిశలో పార్టీ పనిచేయడం లేదని పేర్కొన్నారు.
తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. లక్ష్మణ్‌కు రాసిన లేఖ ప్రతి ఒకటి మీడియా ప్రతినిధులకు అందింది. తాను పార్టీలో ఉండాలని నాయకులు అనుకోకపోతే తనను సస్పెండ్ చేయాలని లక్ష్మణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన వ్యతిరేకులకు పదవులు కట్టబెట్టి తాను సూచించిన వారిని విస్మరించారని, ఈ విషయాన్ని అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.