అభివృద్ధే ధ్యేయం
సాక్షి, ఖమ్మం : జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా పరిషత్ తొలి పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించింది. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయిన కోరం కనకయ్య(టేకులపల్లి)తో పాటు వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు(చుంచుపల్లి), మిగిలిన జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులతో కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఎన్నికల అధికారి హోదాలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలన వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేయడంతో పాటు గత ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని అన్నా రు. ప్రస్తుతం కొత్త జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పా టు కావడంతో గ్రామాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలిగిందన్నారు. గిరిజన ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చూస్తానని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర రంగాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా పనిచేస్తానన్నారు. ఇప్పటికే గత ఐదేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందిందని అన్నారు.
వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేస్తామని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. వైస్‌చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ తనకు ఈ విధంగా నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాధించిన స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. అందరి తోడ్పాటుతో జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత పంచాయతీలు, ప్రస్తుతం పరిషత్‌లు కూడా విభజించడంతో పాలన దగ్గరైందన్నారు. అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి జెడ్పీ చైర్మన్‌గా కోరం కనకయ్య, వైస్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్లు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్, అన్ని మండలాల జెడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తొలిసారిగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ వారిచే ప్రమాణం చేయించారు. వారిలో వాంకుడోతు ఉమాదేవి (ఇల్లెందు), భూక్య కళావతి (జూలూరుపాడు), కొమరం కాంతారావు (కరకగూడెం), పోశం నరసింహారావు (మణుగూరు), సున్నం నాగమణి (ములకలపల్లి), బిందు చౌహాన్ (సుజాతనగర్), వాగబోయిన రామక్క (గుండాల), లాలమ్మ (అన్నపురెడ్డిపల్లి), చిన్నంశెట్టి వరలక్ష్మి (అశ్వారావుపేట), మేరెడ్డి వసంత (లక్ష్మీదేవిపల్లి), బరపటి వాసుదేవరావు (పాల్వంచ), కొడకండ్ల వెంకటరెడ్డి (చండ్రుగొండ), పైడి వెంకటేశ్వరరావు (దమ్మపేట), ఇర్పా శాంత (చర్ల), కామిరెడ్డి శ్రీలత (బూర్గంపాడు), బెల్లం సీతమ్మ (దుమ్ముగూడెం), దాట్ల సుభద్రాదేవి (పినపాక), సూదిరెడ్డి సులక్షణ (అశ్వాపురం), కొమరం హనుమంతరావు (ఆళ్లపల్లి), కో–ఆప్షన్ సభ్యులు షర్ఫుద్దీన్ అహ్మద్, సయ్యద్ రసూల్ ఉన్నారు.