Rajeev Khel Ratna
-
‘ఖేల్‌రత్న’ బరిలో నీరజ్
న్యూఢిల్లీ: భారత మేటి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి కూడా ‘రాజీవ్ ఖేల్‌రత్న’ బరిలో నిలిచాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) 2018 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల చాంపియన్ అయిన నీరజ్‌ను అత్యున్నత క్రీడా పురస్కారానికి వరుగా మూడో ఏడాదీ నామినేట్ చేసింది. 2016లో ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్–20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీరజ్ 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. గత రేండేళ్లుగా నీరజ్‌ను ఏఎఫ్ఐ నామినేట్ చేస్తున్నప్పటికీ చివరకు ‘ఖేల్‌రత్న’ వరించడం లేదు. 22 ఏళ్ల నీరజ్‌కు 2018లో ‘అర్జున అవార్డు’ దక్కింది. మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేతలు అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్జీత్ సింగ్ (800 మీటర్ల పరుగు), మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పి.యు.చిత్రలను ‘అర్జున’ అవార్డుకు సిఫారసు చేసింది. డిప్యూటీ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్‌ను ‘ద్రోణాచార్య’... కుల్దీప్ సింగ్ భుల్లర్, జిన్సీ ఫిలిప్‌లను ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం కోసం ఏఎఫ్ఐ ప్రతిపాదించింది. స్వయంగా దరఖాస్తు చేసుకోండి... ఆటగాళ్లు తమ తమ అర్హతలు, పతకాలు చరిత్రతో సొంతంగా కూడా నామినేట్ చేసుకోవచ్చని క్రీడాశాఖ తెలిపింది. బుధవారంతో ముగియాల్సిన నామినేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి విలయతాండవం దృష్ట్యా ఈసారి క్రీడాశాఖ కేవలం ఈ–మెయిల్ల ద్వారానే దరఖాస్తుల్ని కోరుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక అవార్డుల కమిటీ ఎంపిక చేసే విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్లో అవార్డుల్ని ప్రదానం చేస్తారు. ‘అవార్డులు... ఓ ప్రహసనం’: ప్రణయ్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ ఏడాదీ తనను ‘అర్జున’కు నామినేట్ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్ ట్విట్టర్లో స్పందించాడు. ‘అవార్డుల నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్ చేస్తారు. ‘అవార్డులు ఈ దేశంలో ఓ ప్రహసనం...’ అని ట్వీట్ చేశాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రణయ్... అదే ఏడాది వుహాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్íషిప్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది ‘బాయ్’ ప్రతిపాదించిన ముగ్గురిలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం గెలిచారు. కానీ సమీర్‌వర్మ మాత్రం ఇప్పటి వరకు దేశం తరఫున మెగా ఈవెంట్స్‌లో బరిలోకి దిగలేదు. ప్రణయ్‌కు మద్దతుగా భారత మరో స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ వ్యాఖ్యానించాడు. ‘జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తు చేసే విధానం ఇప్పటికీ అర్థంకాదు. ఈ పద్ధతిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ధైర్యం కోల్పోకుండా దృఢంగా ఉండు సోదరా’ అని ప్రణయ్‌కు కశ్యప్ మద్దతుగా నిలిచాడు. -
ఆ జంప్... ఆహా!
స్కూల్‌గేమ్స్‌లో అంజూ తొలి గెలుపు హర్డిల్స్‌లో! హర్డిల్స్ అంటే తెలుసుగా... అన్నీ దాటుకుంటూ సాగే పరుగు పందెం. ఈ పందెం అమె కెరీర్‌కు చక్కగా నప్పుతుంది. పాఠశాల స్థాయి పోటీల నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల దాకా ఎదురొచ్చిన అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ చివరకు ప్రపంచ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. అంజూ బాబీ జార్జి ఎన్నో హర్డిల్స్నైతే అధిగమించింది కానీ... చరిత్రలో నిలిచింది మాత్రం హర్డిల్స్ క్రీడాంశంలో కాదు... లాంగ్‌జంప్‌తో! స్కూల్లో హర్డిల్స్‌తో మొదలైన తన ఆటల బాటలో రిలే, లాంగ్‌జంప్, హైజంప్, హెప్టాథ్లాన్లన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్లి చివరకు లాంగ్‌జంప్ వద్ద ఆగింది. ఈ జంప్‌తోనే ‘ప్రపంచ’ పతకాన్ని గెలిచింది. ఆ వెంటే ‘ఖేల్‌రత్న’ం వరించింది. కన్నోడు... కట్టుకున్నోడు... చిన్నారి అంజూ చురుకైంది. చదువులో తెలివైంది. ఆటల పోటీల్లో గెలుపు గుర్రంలాంటిది. అందుకే ఆమె కన్నతండ్రి తనకు పుట్టింది అమ్మాయేగా చదువొక్కటి అబ్బితే చాల్లే అని అనుకోలేదు. 40 ఏళ్ల క్రితం ఆయన అలా అనుకొని వుంటే 2003లో పారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించేది కాదు. 1980లో ఆమెను చదువుకోవాలన్నాడు. పోటీపడతానంటే ‘సై’ అన్నాడు. దీంతో 1992లో స్కూల్ గేమ్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ చాంపియనైంది. తదనంతరం క్రీడాకారుడే భర్తగా రావడం ఆమె కెరీర్‌ను ఉన్నతస్థితికి తీసుకెళ్లింది. ఇలా ఆమె జీవితంలో కన్నతండ్రి కె.టి.మార్కోజ్, కట్టుకున్న భర్త బాబీ జార్జిలది అమూల్యమైన ప్రోత్సాహం. వరల్డ్ ఫైనల్స్ చాంపియన్.... రెండేళ్ల తర్వాత (2005) మొనాకోలోని మోంటెకార్లోలో ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ టోర్నీ జరిగింది. ఇందులో ఆమె 6.75 మీటర్ల దూరం గెంతి రజతం గెలిచింది. కానీ ఆమె రిటైరయ్యాక... తొమ్మిదేళ్లయ్యాక ఆ పతకం రంగు మారింది. ఆ పోటీల్లో స్వర్ణం నెగ్గిన తాతియానా కొటోవా (రష్యా–6.83 మీటర్లు) 2014లో డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు ఆమె స్వర్ణాన్ని రద్దు చేసి అంజూను చాంపియన్‌గా ప్రకటించి పసడి పతకాన్ని ఖాయం చేశారు. ఇలా భారత క్రీడాకీర్తిని ప్రపంచ పటంలో నిలిపిన అంజూ ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్‌రత్న’... ‘అర్జున’... ‘పద్మశ్రీ’ పురస్కారాలను అందుకుంది. ఆమె ఘనతలివీ.... ప్రపంచ అథ్లెటిక్స్ కంటే ముందే అంజూ మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్ (2002)లో కాంస్యంతో మెరిసింది. బుసాన్ (2002లో), దోహా (2006లో) ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకుంది. అలాగే వరుసగా ఇంచియోన్ (2005లో), అమ్మాన్ (2007లో) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ స్వర్ణ, రజతాలను రిపీట్ చేసింది. ప్రస్తుతం 43 ఏళ్ల అంజూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఐదో ప్రయత్నం... ప్రపంచ పతకం అంజూ 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం తుది సన్నాహాల్లో ఉంది. అయితే ఈ క్రమంలో ఆమె తీవ్రమైన అలసటతో అస్వస్థతకు గురైంది. ఓ దశలో పారిస్ ఈవెంట్ నుంచి తప్పుకుందామని భావించింది. కానీ భర్త బాబీ ముందుండి ధైర్యం చెప్పాడు. బరిలో దిగేందుకు తోవ చూపాడు. అలా చివరకు ఓ మేజర్ ఈవెంట్‌కు అయిష్టంగానే వచ్చినా మొక్కుబడిగా తలపడలేదు. దేశం కోసం, పతకం కోసం వందశాతం అంకిత భావం కనబరిచింది. ప్రపంచ మేటి అథ్లెట్లు, డిఫెండింగ్ చాంపియన్లు బరిలో ఉన్న లాంగ్‌జంప్‌లో ఒక్కొక్కరి ప్రయత్నాలు మొదలయ్యాయి. అంజూ ఐదో ప్రయత్నంలో 6.70 మీటర్ల దూరం మేర దూకింది. నిజానికి ఇది ఆమె గొప్ప ప్రయత్నమేమీ కాదు. ఎందుకంటే షూస్ స్పైక్ ఒక కాలితో మరొకటి తచ్చాడటంతో ఇబ్బంది పడింది. క్షణాల్లోనే ఇదంతా జరిగినా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని అంత దూరం గెంతడం అంత ఆషామాషీ కాదు. కాసేపయ్యాక ఆరో ప్రయత్నం చేసినా అదేమంతా సక్సెస్ కాలేదు. చివరకు అందరివీ అన్నీ ప్రయత్నాలు పూర్తయ్యాక చూస్తే అంజూ మూడో స్థానం ఖాయమైంది. పోడియంలో కాంస్యం అందుకొని చరిత్ర పుటలకెక్కింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన ఉత్సాహంలో 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన అంజూ ఐదో స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ ఆమె బరిలోకి దిగినా ఫైనల్ చేరలేకపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
సగర్వంగా... సంతోషంగా...
* రాష్ట్రపతి భవన్లో ‘స్పోర్ట్స్ డే’ అవార్డుల ప్రదానం * ఖేల్‌రత్న అందుకున్న సింధు, సాక్షి, దీప, జీతూరాయ్ న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ పరువు నిలబెట్టిన క్రీడారత్నాలకు జాతీయ క్రీడాదినోత్సవాన ఘనంగా సత్కారం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది ముగ్గురు మహిళలకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన క్రీడాపురస్కారాల వేడుకలో తెలుగమ్మాయి పి.వి. సింధుతో పాటు రెజ్లర్ సాక్షి మలిక్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. షూటర్ జీతూరాయ్ కూడా ఈ అవార్డు అందుకున్నాడు. ఇలా ఒకే ఏడాది నలుగురు క్రీడాకారులకు అత్యున్నత క్రీడాపురస్కారం ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌లకు 2009లో రాజీవ్ ఖేల్త్న్ర అందజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటా ఆగస్టు 29న క్రీడాదినోత్సవాన్ని నిర్వహించే సంగతి తెలిసిందే. రియోలో బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్యం గెలిచారు. ఇక దీప జిమ్నాస్టిక్స్‌లో అసాధారణ విన్యాసంతో ఆకట్టుకుంది. తృటిలో కాంస్యం చేజారినా.. ఆమె చేసిన ప్రాణాంతక ప్రొడునోవా విన్యాసానికి గొప్ప గౌరవం లభించింది. ‘ఖేల్త్న్ర’ అవార్డులో భాగంగా పతకంతో పాటు రూ. 7.5 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. మరో 15 మంది క్రీడాకారులు అర్జున అవార్డులు స్వీకరించారు. ఆరుగురు కోచ్‌లు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. క్రీడల్లో ప్రతిభకు పదునుపెడుతున్న పలు సంస్థలకు ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ అవార్డులు ఇచ్చారు. పర్వతారోహకుడు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఇన్స్పెక్టర్ జనరల్ హర్భజన్ సింగ్‌కు ‘టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్’ అవార్డు లభించింది. అర్జున అవార్డును అందుకోవాల్సిన క్రికెటర్ రహానే అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమానికి రాలేదు. తెలుగు వెలుగులు ఈ సారి జాతీయ క్రీడాదినోత్సవ వేదికపై తెలుగువారికి చక్కని గుర్తింపు లభించింది. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు అత్యున్నత క్రీడాపురస్కారం అందుకుంటే... అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థారుులో పోటీపడే అథ్లెట్లను తయారు చేస్తున్న సీనియర్ కోచ్ నాగపురి రమేశ్‌కు ద్రోణాచార్య అవార్డు లభించింది. మాజీ అథ్లెట్ సత్తి గీత ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది. అవార్డు గ్రహీతలు రాజీవ్ ఖేల్త్న్ర (పతకం, రూ. 7.5 లక్షలు): పి.వి.సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్). ద్రోణాచార్య (ట్రోఫీ, రూ. 7 లక్షలు): నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), రాజ్ కుమార్‌శర్మ (క్రికెట్లో కోహ్లి కోచ్), విశ్వేశ్వర్నంది (జిమ్నాస్టిక్స్‌లో దీప కోచ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), సాగర్మల్ దయాల్ (బాక్సింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). అర్జున అవార్డు (ట్రోఫీ, రూ. 5 లక్షలు): రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్, రఘునాథ్ (హాకీ), గుర్‌ప్రీత్‌సింగ్, అపూర్వి చండీలా (షూటింగ్), సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫోగట్, అమిత్ కుమార్, వీరేందర్ సింగ్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్). ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (మెమెంటో, రూ. 5 లక్షలు): సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనుస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షిల్కే (రోరుుంగ్). రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: యువ ప్రతిభావంతులను ప్రోత్సహించిన కేటగిరీ: హాకీ సిటిజన్ గ్రూప్, దాదర్ పార్సి జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్; కార్పొరేట్ సామాజిక బాధ్యత కేటగిరీ: ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫైనాన్స కార్పొరేట్ లిమిటెడ్; క్రీడాకారులకు ఉద్యోగం, సంక్షేమ కేటగిరీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రీడాభివృద్ధి కేటగిరీ: సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స ఎడ్యుకేషన్ సొసైటీ. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: పంజాబ్ యూనివర్సిటీ వీల్‌చెయిర్‌లో... రియో ఒలింపిక్స్‌లో గాయపడిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ అర్జున అవార్డును అందుకుంది. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో... వీల్ చెయిర్లో వచ్చి పురస్కారం అందుకుంది.