నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : కల్తీ చేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా...ఇప్పటివరకూ మనం యూరియా, రసాయనాలు కలిపి పాలు తయారు చేయడం.. జంతు కళేబరాలను, కొవ్వును మరిగించి నూనెలు కాయడం.. కార్బైడ్ వంటి విష రసాయనాలతో పండ్లను మగ్గబెట్టడం.. పసివాళ్లు కూడా తాగే పాలను కూడా కల్తీ చేస్తున్న అక్రమార్కుల దందాలో తాజాగా కల్తీ మసాలాల తయారీ వెలుగుచూసింది.
తాజాగా గసగసాలు మొదలు మిరియాలు, జీలకర్ర, వాము వరకూ ఏదీ వదలటం లేదు. పాతబస్తీ కేంద్రంగా నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ఓ ముఠాను సౌత్ జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి ముగ్గురు, హైదరాబాద్‌కు చెందిన 11మంది వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నకిలీ మసాలాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మసాలాల తయారీకి ప్రమాదకరమైన కెమికల్స్, ఆయిల్స్, కలర్స్‌ను ఈ ముఠా వాడుతున్నట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. బొప్పాయి గింజలతో మిరియాలు, గడ్డితో జీలకర్ర, వాము, సోంప్, బొంబాయి రవ్వతో గసగసాలు, నకిలీ ఆవాలను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు చెప్పారు.
హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రికాపురంలో మూడు గోడౌన్లలో తయారు చేయడం.. బస్తాల్లో వాటిని నింపి బేగంబజార్ తో పాటు రాష్టంలోని వివిధ జిల్లాలకు బస్తాల్లో గిట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. 40 లక్షల విలువైన కల్తీ మసాలాను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపారి రాజేంద్ర గుప్తాతో పాటు బేగం బజార్‌లోని 11మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. రూ.కోట్లలో టర్నోవర్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
*గసగసాల్లో ఉప్మారవ్వ (బన్సీరవ్వ పెద్దరకం, బొంబాయిరవ్వ)ను గసగసాల్లా మార్చేందుకు పిండిమరలో వేస్తారు. కాస్త పలుకుగా మారగానే వాటిని గసగసాల్లో కలిపేస్తారు. తెల్లగా ఉండేందుకు పెయింట్ మిశ్రమాన్ని కలిపి ఆరబెడుతున్నారు.
*మిరియాలు గుండ్రంగా ఉండవు... బొప్పాయి విత్తనాలు గుండ్రంగా ఉంటాయి. వీటిని కలిపేందుకు బొప్పాయి విత్తనాలు ఎగుడుదిగుడుగా మారడానికి ముందుగా రెడ్ఆక్సైడ్ మిశ్రమంతో కలుపుతారు. వాటిని మిరియాలతో కలిపి కంకర మిషన్ తరహాలో యంత్రంలో వేసి కొంచెం బ్లాక్ ఆక్సైడ్‌ను కలుపుతారు. ఇదంతా అయ్యాక ఎండలో ఆరబెట్టి బస్తాల్లో ప్యాకింగ్ చేస్తారు.
*జీలకర్రను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం, వాటిలో సోంపు కలుపుతారు. ఈ మిశ్రమం బాగా దగ్గరగా ఉండేందుకు మైదాపిండితో కలిపి పిండిమరలో ఒకసారి వేసి మళ్లీ కలిపేస్తారు. మరీ తెల్లగా ఉంటే కొంచెం నల్లగా మారేందుకు పెయింట్‌ను చిలకరిస్తారు.