గురుపౌర్ణమి ఏర్పాట్లు పూర్తి
♦ నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు
♦ శోభాయాత్రకు సర్వం సిద్ధం
♦ భక్తుల బస కోసం తాత్కాళిక టెంట్లు ఏర్పాటు
సాక్షి, ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలకు షిర్డీ పుణ్యక్షేత్రం సిద్ధమైంది. ఉత్సవాలను పురస్కరించుకుని షిర్డీకి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా సాయిబాబా సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారీ స్థాయిలో భక్తులు రానున్న నేపథ్యంలో వీఐపీ, హారతి పాస్‌లను ఉత్సవాల సమయంలో నిలిపివేయనున్నట్టు సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ వెల్లడించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు రాజేంద్ర జాదవ్ తెలిపారు.
సాయి ధర్మశాలలో పల్లకీలతో పాదయాత్ర చేస్తూ షిర్డీ చేరుకునే భక్తులకు ఉచితంగా బస కల్పించనున్నట్టు జాదవ్ చెప్పారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఏటా షిర్డీ పుణ్యక్షేత్రానికి రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తజనం తరలివస్తారు. ఈ సారి గురుపౌర్ణమి వేడుకలు జులై 30 (గురువారం) నుంచి ఆగస్టు 1వ తేదీ(శనివారం) వరకు జరగనున్నాయి. భక్తులు బస చేసేందుకు ఆలయానికి సమీపంలో ఉన్న పార్కింగ్ లాట్, ఖాళీ మైదానాల్లో తాత్తాలికంగా టెంట్లు నిర్మించారు. తాగునీరు, తాత్కాలిక మరగుదొడ్లు, అల్పాహార కౌంటర్లు, సెల్ ఫోన్ చార్జింగ్ ఏర్పాట్లు చేశారు.
250 కిలోల లడ్డూలు...
లడ్డుల కొరత రాకుండా 250 క్వింటళ్లతో లడ్డులు తయారు చేస్తున్నారు. మూడు రోజులపాటు వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు బాబా సమాధి మంది రం పక్కన భారీ వేదిక నిర్మించారు. ఈ మూడు రోజుల పాటు కీర్తనలు, భజనలు, సాయి సచ్చరిత పారాయణ పఠనం, గోకులాష్టమి ఉట్టి ఉత్సవం మొదలగు కార్యక్రమాలు జరగనున్నాయి. పల్లకీ ఊరేగింపు, శోభాయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. ఢిల్లీకి చెందిన గౌతం సాయి, అనూప్ జోషీలు అందించిన విరాళాలతో రకరకాల పూలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. ముం బైకి చెందిన సాయిరాజ్ డెకరేటర్స్ తరఫున మందిరం, ఆలయ పరిసరాలను రంగులరంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.
భక్తుల విరాళాలతో..
సాయి భక్తులు సమర్పించిన విరాళాలతో మూడు రోజులపాటు ఉచిత భోజనాలు (మహాప్రసాదం) ఏర్పాటు చేశారు. లక్నోకు చెందిన విక్రమ్ కపూర్, హైదరాబాద్‌కు చెందిన శివానీ దత్, సి.సురేశ్ రెడ్డి, సహానా, ముంబైకి చెందిన అధ్యన్ నారంగ్, చెన్నైకి చెందిన రాజగోపాల్ నటరాజన్, విజయవాడకు చెందిన రతన్ మాణిక్యం, విశాఖపట్నానికి చెందిన కె.రమణమూర్తి, మాధవి, తిరుపతికి చెందిన భట్యాల చంగల్రాయుడు, బెంగళూర్‌కు చెందిన రాధాకృష్ణయ్య, అమర్‌నాథ్‌లతోపాటు పలువురు భక్తులు విరాళాలు అందజేశారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు
భక్తులకు వైద్యసేవలు అందించేందుకు మూడు ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లు, రెండు షిప్టుల్లో వైద్యులను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయం సేవా సంస్థల కార్యకర్తలు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోంగార్డులు తదితర బలగాలు భక్తులకు అందుబాటులో ఉండనున్నారు.