ఎంసెట్-2లో లెక్కలేనన్ని బాగోతాలు
-దర్యాప్తులో వెలుగు చూస్తున్న కొత్త ముఖాలు.. 54కు చేరిన నిందితుల సంఖ్య
-మాఫియా మూలాల్ని ఛేదించే పనిలో సీఐడీ..
-ఏ యే ప్రశ్నాపత్రాలు లీకయ్యాయనే దానిపై దృష్టి
-తాజాగా తమిళనాడుకు చెందిన రాజేష్ రాజశేఖర్ అరెస్ట్
-ఆరుగురు విద్యార్థులను కోల్‌కత్తాలో ‘ప్రత్యేక’ శిక్షణ ఇచ్చినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్
వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో లెక్కలేనన్ని బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీకి అనేక కొత్త ముఖాలు బయటపడుతున్నాయి. వీరందరూ కూడా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఎంసెట్ మాఫియా చైన్ లింక్‌ను చూసి సీఐడీ అధికారులు నివ్వెర పోతున్నారు. ఇప్పటి వరకు నిందితుల జాబితా 54కు చేరువ కాగా, అరెస్టైన వారి సంఖ్య 26కు చేరింది. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిందితులున్నారు. దాదాపు 12 రాష్ట్రాలకు చెందిన వారి హస్తం వెలుగు చూడటంతో సీఐడీ మరింత లోతుగా ఆరా తీస్తోంది. వీరందరూ ఎప్పుడు.. ఎలా కలిశారనే దానిపై దృష్టిసారించి మూలాలను ఛేదించే పనిలో నిమగ్నమైంది.
ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీల పేరుతో దగా...
ఎంసెట్-2ను దర్యాప్తు చేస్తున్న సీఐడీకి అనేక కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎంసెట్-1కు ఎసెంట్-2కు మధ్య కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఎసెంట్-1ను ఈ ఏడాది మే 2న నిర్వహించగా... ఎసెంట్-2ను జులై 9న నిర్వహించారు. ఈ రెండు నెలల వ్యవధిలో నిర్వహించిన రెండో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకవడం అది కూడా 12 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల చేతికి వెళ్లడం అధికారులను విస్మయపరుస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు అరెస్టైన వారందరూ కూడా వివిధ చోట్ల ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలనే నిర్వహిస్తున్నారు.
దీంతో విద్యాసంస్థల పేరుతో ఒక మాఫియా దేశ వ్యాప్తంగా వివిధ రకాల పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్నట్లు సీఐడీ అనుమానిస్తోంది. ఎసెంట్-2ను అతి తక్కువ సమయంలో 200 మందికి పైగా విద్యార్థులను సేకరించడం, వారిని నమ్మించి ‘ప్రత్యేక’ శిక్షణ ఒప్పించడం అంత మామూలు విషయం కాదు. అందుకే ఈ వ్యవస్థ ఎంత కాలం నుంచి ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేస్తుందనే దానిపై సీఐడీ ఆరా తీస్తోంది. దీంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలన్నింపై సీఐడీ సమాచారం సేకరిస్తోంది.
తాజాగా మరో వ్యక్తి అరెస్టు..
ఎసెంట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మరో వ్యక్తి అరెస్టయ్యాడు. తమిళనాడులోని కొయంబత్తూర్‌లో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రాజేష్ రాజశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రోకర్ రాజేష్ రాజశేఖర్... దాదాపు 6గురు విద్యార్థులను సమీకరించి కోల్‌కత్తాలో ఏర్పాటు చేసిన ‘ప్రత్యేక’ శిక్షణ శిబిరంలో తర్పీదు ఇచ్చినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. అలాగే ఈ కుంభకోణంలో మిగిలన వారి పాత్రపై విచారణ చేస్తున్నామని, త్వరలో కీలక వ్యక్తులను అరెస్టు చేస్తామని సౌమ్యామిశ్రా వెల్లడించారు.