Rajiv saluri
-
ఇండస్ట్రీకి కొత్తతరం రావాలి
Megastar Chiranjeevi: ‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీకి వస్తానంటే గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తాను. ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. వాటిని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకొని సిన్సియర్‌గా పని చేస్తే కచ్చితంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలా నేను కూడా కష్టపడుతూ రావడం వలనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది’’ అని అన్నారు చిరంజీవి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా, ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ కుమార్తె వర్షా విశ్వనాథ్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘11:11’. ఈ చిత్రంలో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలక పాత్రధారులు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిరంజీవి మాట్లాడుతూ –‘‘80, 90 దశకంలో హిట్లర్, రిక్షావోడు.. ఇలా నాకు 12 సినిమాల వరకు చేశారు రాజ్–కోటి. సుమారు 60 పాటలంటే నాకు 90 శాతం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఇంత మంచి హిట్ సాంగ్స్ ఇచ్చిన కోటిగారి ఋణం తీర్చుకోలేకపోయాననే బాధ ఉండేది. కానీ ఈ రోజు కోటిగారి కొడుకు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లెజెండరీ సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావుగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తండ్రికి తగ్గ తనయుడిగా రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన సంగీతాన్ని కోటిగారు ప్రేక్షకులకు అందించారు. తన ఇద్దరు కొడుకులలో ఒకరిని సంగీత దర్శకుడిగా మరొకరిని నటుడుగా పరిచయం చేసి ఇండస్ట్రీలో ఇరువైపులా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోటి తనయుడు రాజీవ్, రాజ్‌గారి అబ్బాయి సాగర్లకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి. ఈ సినిమా విజయం సాధించి చిత్రయూనిట్ అందరికీ పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి ఆశీర్వాదాలు అందడం నా కొడుకు అదృష్టం’’ అన్నారు కోటి. ‘‘ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మగారి సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ ’’ అన్నారు దర్శకుడు కిట్టు నల్లూరి. ‘‘చిరంజీవి గారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రాజీవ్ . ‘‘కష్టపడితే ఏదైనా సాధించగలం అనే దానికి చిరంజీవిగారు నిదర్శనం’’ అన్నారు వీరేశ్. ఈ కార్యక్రమంలో వర్షా విశ్వనాథ్, నటుడు రోహిత్, నటుడు సదన్, సినిమాటోగ్రాఫర్ ఈశ్వర్ పాల్గొన్నారు. -
ప్రేమ ప్రయాణం విజయం
ప్రస్తుతం సమాజంలో ప్రేమికుల్ని అర్థం చేసుకోకుండా విడదీసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమికుల్ని విడదీయకూడదు.. కలిపే ప్రయత్నం చెయ్యాలనే కథాంశంతో ధన్వంతరీ క్రియేషన్స్ పతాకంపై ‘మా లవ్ జర్నీ సక్సెస్’ అనే చిత్రం ప్రారంభమైంది. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో కె.పి. లక్ష్మణాచారి నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ సాలూరి కథానాయకుడిగా నటిస్తున్నారు. తొలి సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ నివ్వగా, కోటి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న కోటి మాట్లాడుతూ –‘‘మా అబ్బాయి రాజీవ్ నటిస్తున్న పదో సినిమా ఇది. మంచి కథ. రాజీవ్‌కి మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘హీరో పాత్ర మాస్‌గా, హీరోయిన్ క్యారెక్టర్ క్లాస్‌గా ఉంటుందని దర్శకుడు’’ తెలిపారు. పది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి కెమెరా: పి.విజయ్ కుమార్, పాటలు: చంద్రబోస్, వెనిగళ్ల రాంబాబు. -
కథల ఎంపికలో నాన్నగారు కల్పించుకోరు
‘నోట్‌బుక్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు రాజీవ్ సాలూరి. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వారసునిగా ఇండస్ట్రీకొచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రాజీవ్ నటించిన చిత్రం ‘టైటానిక్’. జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజీవ్ చెప్పిన విశేషాలు... ఈ చిత్రంలో కార్తీక్ అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటించా. నేను, హీరోయిన్ ప్రేమించుకుంటాం. మనస్పర్థలు రావడంతో విడిపోతాం. అప్పుడు హీరోయిన్ను ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ‘టైటానిక్’ అనే బోట్లో చేయాలనుకుంటారు. ఆ బోట్లోకి హీరో ఎలా ఎంటరయ్యాడు? పెళ్లిని ఎలా ఆపగలిగాడు? అన్నదే కథ గోదావరి నదిలో అంతర్వేది నుంచి అమలాపురం వెళ్లే టైటానిక్ బోట్లో ప్రయాణం కావడంతో ‘టైటానిక్’ అని టైటిల్ పెట్టాం. ‘గోదావరి’ చిత్రం కూడా బోట్లోనే చిత్రీకరించినా, రెండింటికీ పోలిక లేదు. దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది ‘సంగీత దర్శకుడివి అయ్యుంటే అండగా ఉండేవాణ్ణి. కానీ, నువ్వు హీరో అయ్యావు. కథల ఎంపికలో నీ నిర్ణయాలు నువ్వే తీసుకో’ అని నాన్నగారు అన్నారు. ఆయన సలహాలు ఇస్తారే కానీ, ఇన్వాల్వ్ కారు. ‘టైటానిక్’ తర్వాత ‘కేటుగాడు’ డెరైక్టర్ కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నా. -
టైటానిక్‌లో వినోదం!
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. చందర్ రావ్ సమర్పణలో జి. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలుపుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు గోదావరి నదిలో లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం. రాజమండ్రిలో పేరుగాంచిన వశిష్ఠ అనే యాత్ర బోట్‌ను టైటానిక్‌గా రూపొందించి షూటింగ్ జరిపాం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. పెళ్లి బృందం వినోదంతో సినిమా సరదాగా సాగుతుంది. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా, రఘుబాబు విలన్‌గా నటించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన పాటలు, ట్రైలర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మా చిత్రం కడుపుబ్బా నవ్విస్తుందనడంలో సందేహం లేదు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: అమర్, సహ నిర్మాత: అట్లూరి సురేష్ బాబు. -
అంతర్వేది టు అమలాపురం
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టైటానిక్’. ‘అంతర్వేది టు అమలాపురం’ అన్నది ఉపశీర్షిక. రాజవంశీ దర్శకత్వంలో కన్నా సినీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మించారు. వినోద్ యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ సీడీ ఆవిష్కరించారు. దర్శకుడు ఎన్. శంకర్ పాటల సీడీ విడుదల చేసి, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్‌కు అందించారు. దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘అంతర్వేది నుంచి అమలాపురం వరకు లాంచీలో జరిగే ప్రయాణమే ఈ చిత్రం. పూర్తి వినోదాత ్మకంగా తెరకెక్కించాం. గోదావరి నదిలో టైటానిక్ లాంచీలో ఏం జరిగిందన్నదే కథ. థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇందులో పెళ్లి కొడుకుగా నటించారు’’ అని తెలిపారు. దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, కల్యాణ్ కృష్ణ, బెల్లం రామకృష్ణా రెడ్డి, రాజీవ్ సాలూరి, సంగీతదర్శకుడు కోటి, సహ నిర్మాత అట్లూరి సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
మూడు తరాలు... మూడు ప్రేమకథలు
ఒకే అపార్ట్మెంట్కి చెందిన మూడు తరాలకు సంబంధించిన మూడు జంటల ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశ’. రాజీవ్ సాలూరి, అజయ్, అపర్ణానాయర్ ముఖ్య తారలు. డా.కిరణ్ దర్శకుడు. శ్రీనివాస్ గరిమెళ్ల నిర్మాత. దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘భావోద్వేగాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. సింగీతంగారు పోషించిన పాత్ర సినిమాకే వన్నె తెచ్చింది. అన్ని వర్గాలనూ అలరిస్తుందీ చిత్రం’’ అన్నారు. ఈ నెలాఖరున కానీ, వచ్చే నెల తొలివారంలో గానీ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ధన్య, బాలకృష్ణన్, వాసు ఇంటూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వీఎన్ సతీష్, సంగీతం: కార్తీక్ ఎం., కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: దాము నర్రావుల, సహ నిర్మాత: ఇందుకూరి నరసింహరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.ఎస్.వి.శివసాయికృష్ణ.