rajiv vidya mission project
-
నిరుద్యోగుల ఆశలు ఆవిరి
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 2 వేల మంది నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (విద్యా బోధకులు) నియామకాలపై గంపెడాశలు పెట్టుకున్న వీరికి చివరికి నిరాశే మిగిలింది. నాలుగు నెలలపాటు ఊరించిన విద్యా బోధకుల నియామకాల ఫైలు అటకెక్కడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పాఠశాలల్లో విద్యా బోధకులను నియమించాలని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ జిల్లాలో అమలుకు నోచుకోలేదు. ఈ పోస్టుల కోసం జిల్లాలో సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకుని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. నియామకాల ఫైలు కలెక్టర్ కార్యాలయం, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం మధ్య చక్కర్లు కొట్టింది. తీరా ఆమోదం పొందేదశలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నియామకాలు నిలిచిపోయాయి. అధికారుల జాప్యం, నిర్లక్ష్యం వెరసి నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. అంతేగాకుండా జిల్లాలోని ఏకోపాధ్యాయ, అసలు ఉపాధ్యాయులే లేని 444 పాఠశాలల్లో విద్యార్థుల చదువులు సజావుగా సాగక వారంతా నష్టపోయారు. 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు... జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరయ్యాయి. గత ఏడాది వేసవి సెలవుల అనంతరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా జిల్లాలోని 286 పాఠశాలల్లో కొన్నింట్లో అసలు టీచర్లు లేకపోగా, మరికొన్నింట్లో మాత్రం ఒక టీచరే బోధిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల కొరతున్న పాఠశాలలకు విద్యా వలంటీర్లను నియమించేవారు. అయితే, విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యా వలంటీర్లను నియమించే అవకాశం లేకుండా పోయింది. కేవలం రెగ్యులర్ టీచర్లతోనే విద్యాబోధన చేయించాలి. అయితే, డీఎస్సీ నిర్వహించకపోవడంతో కొత్త టీచర్ల నియామకాలు జరగలేదు. దీంతో పాఠశాలల్లో విద్యా వలంటీర్లకు బదులుగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాకు ఎన్ని అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు అవసరమని నివేదికలు కోరింది. దీంతో జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలకు, అసలు టీచర్లు లేని పాఠశాలలకు 286 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా, మంజూరు చేశారు. వీరికి నెలకు 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించేందుకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని బడిబయట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న 28మండలాల్లో పాఠశాలలకు విద్యాబోధకులను అదనంగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాకు మంజూ రైన 175 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)కు విడుదలైన నిధులతో ఈ 28 మండలాల్లో నియమించే విద్యాబోధకులకు గౌరవ వేతనం చెల్లించాలి.ఈ విధంగా మరో 246 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేశారు. దీంతో జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 6 పోస్టులను ఉర్దూ అభ్యర్థులకు కేటాయించారు. పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు మంజూరు చేశారు. మొత్తం 1,920 దరఖాస్తులు... జిల్లాకు మంజూరైన 532 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు మొత్తం 1,920 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి తయారు చేసిన రిజర్వేషన్ల జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తారు. టీటీసీ, బీఈడీ, డీఈడీ విద్యార్హతలున్నవారే ఈ పోస్టులకు అర్హులు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా ఈ ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను 2013 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేయాలి. 2014 మార్చి వరకు 7 నెలల పాటు వీరిని కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించారు. దీంతో అభ్యర్థులంతా సంబంధిత మండల విద్యాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు ఎంపిక చేసిన అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)లు పాఠశాలల్లో చేర్చుకోవాలి. అయితే, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిధులతో కూడా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తుండటంతో వీరికి కలెక్టర్ ఆమోదముద్ర తప్పనిసరైంది. దీంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో జాప్యం జరిగింది. -
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కరువు
సాక్షి, గుంటూరు: సర్కారీ స్కూళ్లను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా నడుపుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతుంటారు. తీరా ఆచరణలో మాత్రం విద్యాశాఖ అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ తీవ్రంగా విఫలమవుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఉపాధ్యాయులు, విద్యార్థినుల అభిమానానికి ఆటంకం కలిగించకుండా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెబుతున్నా విద్యాశాఖ చెవికెక్కడం లేదు. ఈ విషయం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల దుస్థితి చూస్తే అవగతమవుతుంది. తలుపుల్లేని గదులు కొన్నిచోట్ల, నీటి వసతి లేనివి మరికొన్న చోట్ల, ముళ్లపొదల మధ్య శిథిల స్థితిలో ఇంకొన్ని చోట్ల ఇలా సింహభాగం నిరుపయోగమైనవే దర్శనమిస్తాయి. సగం పాఠశాలల్లో నిర్వహణ సరిగా లేకపోగా మరికొన్ని చోట్ల అసలు మరుగుదొడ్డి సౌకర్యమే లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో 2500 ప్రాథమిక, 400 ప్రాథమికోన్నత, 350 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రాజీవ్ విద్యామిషన్ నుంచి విడుదలయ్యే నిధులతో ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ప్రజాప్రతినిధులు జిల్లా సమీక్షా మండలి సమావేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడుతున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. శుభ్రతకు నీరు కరువు.. జిల్లాలో 310 జెడ్పీ హై స్కూళ్లు, 12 గవర్నమెంటు, 30 మునిసిపల్ , 87 ఎయిడెడ్ హైస్కూళ్లలో సగభాగం అసలు మరుగుదొడ్లు లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులున్న చోట నీటి వసతి కరువైంది. ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీ, మున్సిపాల్టీల పరిధిలో కుళాయి కనెక్షన్లు కావాలని దరఖాస్తు చేసినా సంబంధిత శాఖలు దీనిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా సరైన నీటి వసతిలేక మరుగుదొడ్ల వినియోగమే తప్ప వాటిని శుభ్రపరచడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఉన్నత పాఠశాలల్లో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలల పరిధిలో దాదాపు 290 స్కూళ్లలో నైట్ వాచ్మన్లు లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లను బయటివ్యక్తులు ఉపయోగిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయలేమి.. ఆర్వీఎం ద్వారా అందుతున్న నిధులను పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి, కొన్ని పనులను గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్)కు అప్పగించారు. ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్వీఎం, విద్యాశాఖల నడుమ సమన్వయం లేదు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) పథకం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు విద్యాశాఖ ఇటీవలే ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు పంపితే నిర్మిస్తాం.. నీటి సౌకర్యం లేక అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలలు, విద్యార్థుల ఇబ్బందులను ‘సాక్షి’ రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి తన్నీరు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పాఠశాలల్లో మరుగుదొడ్లు అవసరమైన చోట ప్రతిపాదనలు పంపితే తక్షణమే నిర్మాణం చేపడతామన్నారు. స్కూల్ గ్రాంట్స్ నిధుల్లో నుంచి ఫినాయిల్, చీపుర్లు కొనుగోలు చేసుకుని పనివారితో మరుగుదొడ్లను శుభ్రం చేయించకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించినట్లు చెప్పారు. -
సిగ్గు పడాలి
న్యూస్‌లైన్ బృందం, అనంతపురం : జిల్లాలో 2,963 ప్రాథమిక, 504 ప్రాథమికోన్నత, 602 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే ప్రత్యేకావసరాల పిల్లల (వికలాంగులు) కోసం 13 పాఠశాలలు నడుస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలుండాలి. అయితే, జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కన్పించడం లేదు. చాలా చోట్ల మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న చోట కూడా నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. మొత్తం 4,069 ప్రభుత్వ పాఠశాలలకు గాను 666 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని గుర్తించిన ఆర్వీఎం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో ప్రభుత్వం 2011-12 విద్యా సంవత్సరంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో మరుగుదొడ్డికి రూ.45 వేల చొప్పున మొత్తం రూ.2.99 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు 600 పూర్తికాగా, 66 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో మునిసిపల్ ట్యాంకర్ల ద్వారా మరుగుదొడ్లకు నీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారు. గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్లపై సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి, వాటికి ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే... చాలా చోట్ల సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. రెండు నెలల్లో సమస్య పరిష్కరిస్తాం ప్రతి యేటా మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, వాటిని నిర్మిస్తున్నాం. అయితే... పర్యవేక్షణ సరిగా లేక అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో సెలవుల్లో ఇతరులు ప్రవేశించి మరుగుదొడ్లను అధ్వానం చేస్తున్నారు. వీటిపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు దృషి ్టసారించేలా అవగాహన కల్పిస్తాం. ఏదిఏమైనా రెండు నెలల్లో పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించి తీరతాం. - రామారావు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్