ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 2 వేల మంది నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల (విద్యా బోధకులు) నియామకాలపై గంపెడాశలు పెట్టుకున్న వీరికి చివరికి నిరాశే మిగిలింది. నాలుగు నెలలపాటు ఊరించిన విద్యా బోధకుల నియామకాల ఫైలు అటకెక్కడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పాఠశాలల్లో విద్యా బోధకులను నియమించాలని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ జిల్లాలో అమలుకు నోచుకోలేదు.
ఈ పోస్టుల కోసం జిల్లాలో సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకుని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. నియామకాల ఫైలు కలెక్టర్ కార్యాలయం, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం మధ్య చక్కర్లు కొట్టింది. తీరా ఆమోదం పొందేదశలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా నియామకాలు నిలిచిపోయాయి. అధికారుల జాప్యం, నిర్లక్ష్యం వెరసి నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. అంతేగాకుండా జిల్లాలోని ఏకోపాధ్యాయ, అసలు ఉపాధ్యాయులే లేని 444 పాఠశాలల్లో విద్యార్థుల చదువులు సజావుగా సాగక వారంతా నష్టపోయారు.
532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల
పోస్టులు మంజూరు...
జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరయ్యాయి. గత ఏడాది వేసవి సెలవుల అనంతరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా జిల్లాలోని 286 పాఠశాలల్లో కొన్నింట్లో అసలు టీచర్లు లేకపోగా, మరికొన్నింట్లో మాత్రం ఒక టీచరే బోధిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల కొరతున్న పాఠశాలలకు విద్యా వలంటీర్లను నియమించేవారు. అయితే, విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యా వలంటీర్లను నియమించే అవకాశం లేకుండా పోయింది. కేవలం రెగ్యులర్ టీచర్లతోనే విద్యాబోధన చేయించాలి. అయితే, డీఎస్సీ నిర్వహించకపోవడంతో కొత్త టీచర్ల నియామకాలు జరగలేదు.
దీంతో పాఠశాలల్లో విద్యా వలంటీర్లకు బదులుగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాకు ఎన్ని అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు అవసరమని నివేదికలు కోరింది. దీంతో జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలకు, అసలు టీచర్లు లేని పాఠశాలలకు 286 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా, మంజూరు చేశారు. వీరికి నెలకు 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించేందుకు నిధులు కూడా మంజూరు చేశారు.
ఇదిలా ఉండగా, జిల్లాలోని బడిబయట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న 28మండలాల్లో పాఠశాలలకు విద్యాబోధకులను అదనంగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాకు మంజూ రైన 175 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)కు విడుదలైన నిధులతో ఈ 28 మండలాల్లో నియమించే విద్యాబోధకులకు గౌరవ వేతనం చెల్లించాలి.ఈ విధంగా మరో 246 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేశారు. దీంతో జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 6 పోస్టులను ఉర్దూ అభ్యర్థులకు కేటాయించారు. పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు మంజూరు చేశారు.
మొత్తం 1,920 దరఖాస్తులు...
జిల్లాకు మంజూరైన 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు మొత్తం 1,920 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి తయారు చేసిన రిజర్వేషన్ల జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తారు. టీటీసీ, బీఈడీ, డీఈడీ విద్యార్హతలున్నవారే ఈ పోస్టులకు అర్హులు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా ఈ ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను 2013 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేయాలి.
2014 మార్చి వరకు 7 నెలల పాటు వీరిని కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించారు. దీంతో అభ్యర్థులంతా సంబంధిత మండల విద్యాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు ఎంపిక చేసిన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)లు పాఠశాలల్లో చేర్చుకోవాలి. అయితే, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిధులతో కూడా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తుండటంతో వీరికి కలెక్టర్ ఆమోదముద్ర తప్పనిసరైంది. దీంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో జాప్యం జరిగింది.
నిరుద్యోగుల ఆశలు ఆవిరి
Published Mon, Apr 14 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM
Advertisement
Advertisement