సాక్షి, గుంటూరు: సర్కారీ స్కూళ్లను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా నడుపుతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతుంటారు. తీరా ఆచరణలో మాత్రం విద్యాశాఖ అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ తీవ్రంగా విఫలమవుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఉపాధ్యాయులు, విద్యార్థినుల అభిమానానికి ఆటంకం కలిగించకుండా చూడాలని సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెబుతున్నా విద్యాశాఖ చెవికెక్కడం లేదు.
ఈ విషయం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల దుస్థితి చూస్తే అవగతమవుతుంది. తలుపుల్లేని గదులు కొన్నిచోట్ల, నీటి వసతి లేనివి మరికొన్న చోట్ల, ముళ్లపొదల మధ్య శిథిల స్థితిలో ఇంకొన్ని చోట్ల ఇలా సింహభాగం నిరుపయోగమైనవే దర్శనమిస్తాయి. సగం పాఠశాలల్లో నిర్వహణ సరిగా లేకపోగా మరికొన్ని చోట్ల అసలు మరుగుదొడ్డి సౌకర్యమే లేదంటే అతిశయోక్తి కాదు.
జిల్లాలో 2500 ప్రాథమిక, 400 ప్రాథమికోన్నత, 350 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రాజీవ్ విద్యామిషన్ నుంచి విడుదలయ్యే నిధులతో ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్యను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ప్రజాప్రతినిధులు జిల్లా సమీక్షా మండలి సమావేశాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడుతున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు.
శుభ్రతకు నీరు కరువు.. జిల్లాలో 310 జెడ్పీ హై స్కూళ్లు, 12 గవర్నమెంటు, 30 మునిసిపల్ , 87 ఎయిడెడ్ హైస్కూళ్లలో సగభాగం అసలు మరుగుదొడ్లు లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులున్న చోట నీటి వసతి కరువైంది. ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీ, మున్సిపాల్టీల పరిధిలో కుళాయి కనెక్షన్లు కావాలని దరఖాస్తు చేసినా సంబంధిత శాఖలు దీనిపై దృష్టి సారించడం లేదు.
ఫలితంగా సరైన నీటి వసతిలేక మరుగుదొడ్ల వినియోగమే తప్ప వాటిని శుభ్రపరచడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఉన్నత పాఠశాలల్లో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలల పరిధిలో దాదాపు 290 స్కూళ్లలో నైట్ వాచ్‌మన్లు లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లను బయటివ్యక్తులు ఉపయోగిస్తున్నారు.
శాఖల మధ్య సమన్వయలేమి.. ఆర్వీఎం ద్వారా అందుతున్న నిధులను పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి, కొన్ని పనులను గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్)కు అప్పగించారు. ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్వీఎం, విద్యాశాఖల నడుమ సమన్వయం లేదు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) పథకం కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు విద్యాశాఖ ఇటీవలే ప్రతిపాదనలు పంపింది.
ప్రతిపాదనలు పంపితే నిర్మిస్తాం..
నీటి సౌకర్యం లేక అపరిశుభ్రంగా ఉన్న పాఠశాలలు, విద్యార్థుల ఇబ్బందులను ‘సాక్షి’ రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి తన్నీరు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పాఠశాలల్లో మరుగుదొడ్లు అవసరమైన చోట ప్రతిపాదనలు పంపితే తక్షణమే నిర్మాణం చేపడతామన్నారు. స్కూల్ గ్రాంట్స్ నిధుల్లో నుంచి ఫినాయిల్, చీపుర్లు కొనుగోలు చేసుకుని పనివారితో మరుగుదొడ్లను శుభ్రం చేయించకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించినట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కరువు
Published Tue, Dec 10 2013 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement