rajsekhar
-
చిరు-రాజశేఖర్: ఇప్పటికీ విబేధాలు తగ్గలేదా!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్‌కు మధ్య సత్సంబంధాలు లేవనేది టాలీవుడ్లో అందరికీ తెలిసిన విషయమే. ‘ఠాగూర్’ సినిమా నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. తమిళం బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘రమణ’ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. కానీ, చిరంజీవి చివరినిమిషంలో రంగంలోకి దిగి.. ఆ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆ సినిమాను ‘ఠాగూర్’గా రిమేక్ చేయడం.. అది సెన్సేషనల్ హిట్ కావడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు సరికదా.. దూరం మరింత పెరిగిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై దాడి జరగడం, చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించడం తెలిసిందే. కాలం గడుస్తున్నకొద్దీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదని తాజాగా తెలుస్తోంది. ఇటీవల కన్నుమూసిన దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం ఫిల్మ్‌నగర్‌లో జరిగింది. చిరంజీవి ఈ సంతాపసభకు హాజరై.. మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరమే రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఇది కేవలం యాదృచ్ఛికమేనని అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేందుకు ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని, చిరు-రాజశేఖర్ మధ్య ఇప్పటికీ సఖ్యత లేనట్టు కనిపిస్తున్నదని అంటున్నారు. -
పవన్ కల్యాణ్ పాటకు ఆ హీరో డాన్స్
హైదరాబాద్: ఒకపుడు ఆ రెండు సినీ కుటుంబాల మధ్య దాదాపు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం . మరీ ముఖ్యంగా ఆ టాలీవుడ్ హీరోలిద్దరూ ఒకరు ఉప్పు అయితే మరొకరు నిప్పు అన్నట్టుగా ఉండేవారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడమే కాదు.. తమ తమ చిత్రాల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసుకునేంతగా. అయితే కాలక్రమంలో వారిద్దరూ శాంతించినట్టే చెప్పుకోవాలి. ఇపుడు తాజా పరిణామాలు చూస్తోంటే పరిస్థితి మరింత చక్కబడ్డట్టు కనిపిస్తోంది. అమెరికాలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలకు హాజరైన టాలీవుడ్ హీరో రాజశేఖర్... పవన్ కల్యాణ్ పాటకు డాన్స్ చేశారు. న్యూజెర్సీలో జరిగిన ఈ వేడుకల్లో స్టేజీపై పవన్ సినిమాల్లోని పాటలకు చాలా హుషారుగా స్టెప్స్ వేశారు. అత్యంత ఉత్సాహంగా జరిగిన దీపావళి సంబరాల్లో రాజశేఖర్ భార్య జీవిత, కూతుర్లు శివానీ, శివాత్మిక కూడా హల్ చల్ చేశారు. కాగా గతంలో జీవిత రాజశేఖర్ దంపతులపై చిరంజీవి అభిమానుల దాడి, అనంతరం రాజశేఖర్ దంపతులు మెగా ఫ్యామిలీపై విమర్శలు గుప్పిస్తూ కేసు నమోదు చేయడంతో వివాదానికి తెర లేచింది. పరస్పర రాజీతో కొంతకాలం చల్లబడినా అడపా దడపా రగడ రగులుతూనే ఉంది. మళ్లీ ఆ తర్వాత పవన్ కల్యాణ్ మీద విమర్శలు, పరస్పరం ఒకర్నొకరు ఇమిటేట్ చేస్తూ సినిమాల్లో సెటైరికల్ సన్నివేశాలు పెట్టడం అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.