చిరు-రాజశేఖర్: ఇప్పటికీ విబేధాలు తగ్గలేదా!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్‌కు మధ్య సత్సంబంధాలు లేవనేది టాలీవుడ్‌లో అందరికీ తెలిసిన విషయమే. ‘ఠాగూర్’ సినిమా నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. తమిళం బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘రమణ’ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకున్నారు. కానీ, చిరంజీవి చివరినిమిషంలో రంగంలోకి దిగి.. ఆ హక్కులను చేజిక్కించుకున్నారు. ఆ సినిమాను ‘ఠాగూర్’గా రిమేక్ చేయడం.. అది సెన్సేషనల్ హిట్ కావడం అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత కూడా వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడలేదు సరికదా.. దూరం మరింత పెరిగిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై దాడి జరగడం, చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించడం తెలిసిందే. కాలం గడుస్తున్నకొద్దీ ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదని తాజాగా తెలుస్తోంది.
ఇటీవల కన్నుమూసిన దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం ఫిల్మ్‌నగర్‌లో జరిగింది. చిరంజీవి ఈ సంతాపసభకు హాజరై.. మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరమే రాజశేఖర్ దంపతులు వచ్చారు. ఇది కేవలం యాదృచ్ఛికమేనని అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ వర్గాలు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఒకరికి ఒకరు తారసపడకుండా ఉండేందుకు ఒకరు వెళ్లిపోయిన తర్వాత మరొకరు వచ్చారని, చిరు-రాజశేఖర్ మధ్య ఇప్పటికీ సఖ్యత లేనట్టు కనిపిస్తున్నదని అంటున్నారు.