‘ముంబై మోడల్’ కేసులో నిందితుడి అరెస్టు
సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని మోసం
సికింద్రాబాద్: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని ముంబై మోడల్‌ను నగరానికి రప్పించి మోసం చేసిన కేసులో నిందితుడిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సోషల్ నెట్వర్క్ ద్వారా యువతులను పరిచ యం చేసుకుని, సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానని చెప్పి వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం... ముంబైకి చెందిన మోడల్ శుభ్రతాదత్త సినిమాల్లో చాన్స్‌ల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే పుణెకు చెందిన జిత్తు అనే సినిమా బ్రోకర్ పరిచయమయ్యాడు. ఆమెను ఈనెల 4న హైదరాబాద్‌కు తీసుకువచ్చి సికింద్రాబాద్ కార్ఖానా ప్రాంతానికి చెందిన ప్రీత్‌సింగ్ ఎలియాస్ రాజువర్మకు(35)కు అప్పగించాడు.
ఆ తరువాత జిత్తు తిరిగి పుణె వెళ్లిపోయాడు. మొదటిరోజు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చి, మరుసటిరోజు ఆమెను సికింద్రాబాద్ ప్రాంతంలోని ఒక లాడ్జీకి తరలించాడు ప్రీత్‌సింగ్. కొద్దిరోజులు ఆమెను లాడ్జీలోనే ఉంచాక ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు లేవని కొద్దిరోజుల తరువాత మళ్లీ సమాచారం అందిస్తామని, అప్పుడు రావాల్సిందిగా చెప్పి తిరిగి ముంబై పంపించేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చాడు.
ఈ క్రమంలో ప్రీత్‌సింగ్ మత్తుమందు ఇచ్చాడని తాను అపస్మారక స్థితికి చేరుకోగానే తన వద్ద ఉన్న రూ.15 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయాడని దత్తా గోపాలపురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది.
గోపాలపురం పోలీసులు రైల్వేస్టేషన్ సమీపంలోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడి కోసం విచారణ ప్రారంభించి ప్రీత్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మారేడుపల్లికి చెందిన ఓ యువతికి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికిన ప్రీత్‌సింగ్ ఆమెను కర్నూలు ప్రాంతానికి చెందిన కొందరు యువకులకు విక్రయించినట్టు తేలింది.