అవాకులు, చెవాకులు పేలొద్దు!
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమం చేసిన కొందరు అవాకులు, చెవాకులు పేలడం సరికాదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. దానికన్నా వారు బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందిస్తే మంచిదని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభకు ఎన్నికైన తరువాత తొలిసారిగా మంగళవారం హన్మకొండకు వచ్చిన కెప్టెన్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ప్రజల ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని కేసీఆర్ ముందుకుపోతున్నారని చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై విశ్వాసంతో ఉన్నారని అన్నారు.