విజయం ఆప్‌దే
న్యూఢిల్లీ: ఎన్నికల్లో విజయం మాదేనని ఢిల్లీ మాజీ మంత్రి, మంగోల్‌పురి నియోజకవర్గ ఆప్ అభ్యర్థి రాఖీ బిర్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పద వికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంగీకరించారు. అయినా వారు పార్టీని మాత్రం వీడలేదని స్పష్టం చేశారు. ప్రజల అండతో శనివారం జరిగే ఎన్నికల్లో ఆప్ సంపుర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆప్‌లో కీలక నేతగా ఉన్న రాఖీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి రాష్ట్ర మంత్రి రాజ్ కుమార్ చౌహాన్‌ను ఓడించారు. 26 ఏళ్లకే కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టి అప్పట్లో సంచలనం సృష్టించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆమె ప్రజలిచ్చే ఫండ్‌నే నమ్ముకుని ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల విలువ రూ. 51,150గా నమోదు చేసిన ఆమె ఈసారి రూ. 18,500గా పేర్కొన్నారు. ‘డబ్బు లేకపోవడం నా ముందున్న అతి పెద్ద సవాల్. కానీ నా దగ్గరున్న వాలంటీర్లే కొండంత అండ. నిస్వార్థంగా, పూర్తి అంకిత భావంతో వారు నా తరఫున ప్రచారం చేస్తున్నారు. నాతో కలసి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు..’ అని ఆనందం వ్యక్తం చేశారు.
మహిళలకు భద్రత కల్పిస్తా
మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తానని బిర్లా వెల్లడించారు. నేర రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని చెప్పారు. మురుగునీటి సమస్య నిర్మూలన, మంచినీటి సరఫరా, విద్యుత్ అంశాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. ‘మంగోల్‌పురిలో రక్షణ ఉందని మహిళలు భావించడం లేదు. మురుగునీటిని అదుపులో ఉంచడానికి సరైన వ్యవస్థ లేదు. ప్రజలు పెన్షన్ ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నారు. నీరు, కరెంట్ కోతలు వంటి మౌలిక సదుపాయాల కొరత ఉంది. నాకు వచ్చిన నిధులతో నియోజకవ ర్గంలోసోలార్ బల్బులు పెట్టించాను. పార్క్‌ల్లో సీసీటీవీలు అభివృద్ధి చేశాను..’ అని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి, చేయబోయే పనుల గురించి వివరిస్తూ బిర్లా ప్రచారంలో దూసుకుపోతున్నారు.