ఆ జవాను కాంగ్రెస్ సర్పంచ్‌గా గెలిచాడు!
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌వోపీ) అమలు విషయమై ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను రాంకిషన్ గ్రెవాల్‌పై మరోసారి కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. రాంకిషన్ మానసిక పరిస్థితిపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీకేసింగ్ తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని ఆరోపించారు. రాంకిషన్ కాంగ్రెస్ టికెట్‌పై సర్పంచ్‌గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని చెప్పారు. ఏదిఏమైనా ఆయన ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయనకు ఆత్మహత్య చేసుకోవడానికి సల్ఫాస్ ట్యాబ్లెట్లు ఎవరు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బ్యాంకు డబ్బు విషయమై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాం కిషన్ సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించి.. అది లభించకపోయి ఉంటే.. అప్పుడు తమ తప్పు అయ్యేదని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తప్పేమీ లేదని పేర్కొన్నారు.
ఆర్మీ జవాన్లుకు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినమేరకు ఓఆర్‌వోపీ పథకాన్ని అమలుచేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ లక్షమందికిపైగా రక్షణశాఖ సిబ్బందికి ఓఆర్‌వోపీ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు.
కాగా, ఆత్మహత్య చేసుకున్న జవాను మానసిక పరిస్థితి ఏమిటో విచారించాలన్న వీకే సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత రాజ్ బబ్బర్ మండిపడ్డారు. ముందు వీకే సింగ్ మానసిక పరిస్థితి ఏమిటో ఆరా తీయాలని, ఇలాంటి వ్యక్తి పేరు ముందు జనరల్ అని రాసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.