జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యం
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధే తనకు ప్రధాన లక్ష్యమని, నగరంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఫేజ్ -2 లబ్ధిదారులకు శనివారం రఘునాధపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన లాటరీ తీసి లబ్ధిదారులకు పట్టా లు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి నుంచి ఒక సంస్కృతి ఉందని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజకీయాలకు అతీతంగా అంతరం కలిసి జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నా రు. నగరానికి ఇంత దగ్గర్లో స్థలం ఎక్కడా లేదని, సుమారు 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉందని అన్నారు. రఘునాధపాలెం మండల కేంద్రంలోనే స్థలాలను అందిస్తున్న ట్లు వివరించారు. ప్రస్తుతం 13 ఏకరాల్లో సుమారు 300 మందికి ఇంటిస్థలాలు ఇస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు 100 మందికి స్థలాలు ఇస్తున్నామని మంత్రి చెబుతుండగా మహిళలు అడ్డుకున్నారు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్టుబట్టారు.
దీనిపై స్పందించిన మంత్రి దశల వారీగా అందరికి స్థలాలు ఇస్తామని అన్నారు. ఇక్కడి గుట్టపై నర్సిహస్వామి ఆలయం నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించామని అన్నారు. నగరంలో సాగర్ కాల్వలపై ఇళ్లు కోల్పోయిన అర్హులందరికీ కూడా స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు. గతంలో పని చేసిన కలెక్టర్ ఉషారాణి ఇక్కడి భూములను స్వాధీనం చేసుకోకుండా లబ్ధిదారులకు పోస్టులో ఇంటిపట్టాలు పంపించిందని, అందువల్లే స్థలాల సమస్య వచ్చిందని అన్నారు. స్థలాలు పంపిణీ చేసిన వారికి మరో రెండు రోజుల్లో ఇళ్లు కూడా మం జూరు చేస్తామని, అందరు వెంటనే ప్రారంభించాలని సూచించారు. స్థానికంగా తహశీల్దార్ కార్యాల యం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామ ని అన్నారు. కైకొండాయిగూడెం లిఫ్ట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు.
డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇంటిస్థలాలు, సాగుభూముల కోసం పోరాటాలు మనకు తెలియనివి కావన్నారు. తరతరాలుగా సమాజంలో ఈ సమస్య ఉందన్నారు. నగరంలో కాల్వల పై ఉన్న ఇళ్లను తొలగించడం పట్ల తాము కూడా చాలా బాధపడ్డామని అన్నారు. అనంతరం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని మోడల్ కాలనీగా తయారు చేయాలని అధికారులను అదేశించారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి 6 చేతి పంపులను వేయించనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో పట్టాలు ఇచ్చిన సుమారు 8 వేల మంది పేదలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఇస్తున్న ప్రదేశంలో రోడ్లు, వీధిలైట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తే ప్రజలు ఇళ్ళు నిర్మించుకుంటారన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాల సాని లక్ష్మీనారాయణ, మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బాబురావు, ఆర్డీవో సంజీవరెడ్డి, తహశీల్దార్ అశోకచక్రవర్తి, గ్రామ సర్పంచ్ ప్రసాద్, నాయకులు గాజుల ఉమమాహేశ్వరరావు, షేక్ మదార్ సాహెబ్, శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.