ramakantreddi
-
మున్సి ‘బెల్స్’ మోగిన నగారా
30న పోలింగ్ నేతల్లో అంతర్మథనం ఎన్నికల నిర్వహణ కసరత్తులో అధికారులు జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి సోమవారం పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించటంతో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మరో నాలుగైదు రోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడంతో పార్టీల నేతల్లో అలజడి రేగింది. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ ప్రకటనతో సోమవారం నుంచే నియామావళి అమలులోకి వచ్చింది. గత 41 నెలలుగా పురపాలక సంఘాల్లో పాలకవర్గాలు లేకపోవటంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా ఎన్నికల కమిషన్ పాటిస్తుండటంతో పురపాలక సంఘాల్లో ఎన్నికల షెడ్యూలు ఎట్టకేలకు విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి 10 నుంచి 14 వరకు నామినేషన్ల స్వీకరణ, 15న పరిశీలన, 18న ఉపసంహరణ ఉంటుంది. 30న ఎన్నికలు నిర్వహిస్తారు. అనివార్య కారణాల వల్ల ఏదైనా వార్డులో రీ-పోలింగ్ జరపాల్సి వస్తే ఏప్రిల్ ఒకటిన జరుపుతారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఓటర్ల జాబితా పరిశీలనలో అధికారులు... పురపాలక సంఘాల్లో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించటంతో ఆ శాఖ అధికారులు ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. 10వ తేదీ నాటికి ఎన్నికల అధికారుల నియామకం జరగాలని, వార్డుల వారీ ఓటర్ల జాబితాలు ప్రచురించాలని ఆయన సూచించారు. నాయకుల్లో అలజడి... మరో నాలుగైదు రోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు సాధారణ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఈ తరుణంలో పురపాలక సంఘాల్లో ఎన్నికలు మార్చి 30వ తేదీనే నిర్వహిస్తామని అధికారిక ప్రకటన విడుదల కావటంతో అన్ని పార్టీల నాయకులు అంతర్మథనంలో పడిపోయారు. పురపాలక సంఘాల ఎన్నికలను ఎదుర్కొనే పనిలో భాగంగా ద్వితీయశ్రేణి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ల పర్వం 10న ప్రారంభం కానుండటంతో నాయకులు గెలిచే అభ్యర్థుల వేటలో పడ్డారు. దీనికితోడు ఎన్నికల కోడ్ సోమవారం నుంచే అమలులోకి రావటంతో వివిధ రాజకీయ పక్షాలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిని పురపాలక సంఘాల అధికారులు, సిబ్బంది తొలగించే పనిని చేపట్టారు. పురపాలక సంఘాల్లో ఆయా వార్డుల ఆధారంగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు తదితర పనులను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైతే ఇటు సాధారణ ఎన్నికలతో పాటు పురపాలక సంఘాల ఎన్నికలను ఒకేసారిగా ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయ నాయకుల్లో అలజడి ప్రారంభమైంది. అన్ని రాజకీయపక్షాలు ఆయా వార్డులకు కేటాయించిన రిజర్వేషన్లు, వార్డులో ఏయే సామాజిక వర్గాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, బలమైన అభ్యర్థి ఎవరు, ఆశావహులు వారి బలాలు, బలహీనతలు తదితర అంశాలను బేరీజు వేస్తున్నాయి. వ్యూహాత్మకంగానే నిర్వహిస్తున్నారా... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సుప్తచేతనావస్థలో ఉంచటంతో రాష్ట్రపతి పాలన అమలవుతోంది. రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రలో జరిగిన ఉద్యమాలు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తదితర కారణాల నేపథ్యంలో ఆ పార్టీకి నాయకుల కొరత తీవ్రంగా ఏర్పడింది. సాధారణ ఎన్నికలు జరిగితే పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లు కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తులు ఓడినా, గెలిచినా సాధారణ ఎన్నికల్లో కనీసం ఆ అభ్యర్ధి పోలింగ్ ఏజెంట్లనైనా పెట్టుకునేందుకు సాహసం చేస్తాడనేది రాజకీయ నాయకుల విశ్లేషణ. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి ఎంతో కొంత తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందనే కారణంతోనే హఠాత్తుగా పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పురపాలక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపోటములను పక్కనపెడితే ఇతర పార్టీల నాయకుల విలువైన సమయాన్ని వృథా చేసేందుకే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రచారానికి తక్కువ రోజుల వ్యవధి ఉండటంతో కొంత మేరైనా ఖర్చు తగ్గుతుందని ఈ అంశం పోటీలో ఉన్న అభ్యర్థులకు లాభిస్తుందని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో 8 పురపాలక సంఘాలు, 218 మంది కౌన్సిలర్లు... జిల్లాలో ఎనిమిది పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటిలో 218 మంది కౌన్సిలర్లను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికైన కౌన్సిలర్ల నుంచి ఆయా పురపాలక సంఘాలకు కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మచిలీపట్నంలో 42, గుడివాడలో 36, నూజివీడులో 30, జగ్గయ్యపేటలో 25, పెడనలో 23 వార్డులు ఉన్నాయి. 2011 డిసెంబరు 28న ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వీటిలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. తిరువూరులో 20, ఉయ్యూరులో 20, నందిగామ నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. -
మున్సి‘పోల్స్’ వీడని ఉత్కంఠ
ఎన్నికల నిర్వహణపై సందేహాలు వాయిదా పడొచ్చంటున్న అధికారులు సాధారణ ఎన్నికలు, పరీక్షలు కారణం! తుది నిర్ణయం నేడే మున్సిపల్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు, నాలుగు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేదా అనే అంశం చర్చనీయాంశమైంది. నిర్ణయం ఏదైనా ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించే అవకాశముంది. ఎన్నికలు జరిగితే నిర్వహణ పరంగా అధికారులకు, పోటీ పరంగా రాజకీయ నేతలకు ఇబ్బందికరమే. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు, నాలుగు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించటం కష్టసాధ్యమనే భావన అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పలువురు ఎదురుచూస్తున్నారు. సాధారణ ఎన్నికలు జరిగే తరుణంలో పురపాలక సంఘ ఎన్నికలు జరిగితే రాజకీయ నాయకులకు తలనొప్పులు తప్పవనే భావన పలువురి నుంచి వ్యక్తమవుతోంది. ప్రకటన నేడే... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి సోమవారం పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తారని మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో అన్ని రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, పురపాలక సంఘాల్లో చైర్మన్ పదవికి రిజర్వేషన్లను శనివారం గవర్నర్ ఆమోదించారు. సాధారణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించటం కష్టమని, దీనిపై కోర్టుకు ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మచిలీపట్నం, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట, గుడివాడ మునిసిపాల్టీలకు, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అధికారులకు తలనొప్పే... సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరగవని అధికారులు పేర్కొంటున్నారు. రెండు ఎన్నికలకు సిబ్బందిని కేటాయించటం ప్రహసనంగానే ఉంటుందని వారు చెబుతున్నారు. పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పిందని, ఈ తీర్పుపై ఫుల్ బెంచ్‌కు వెళ్లే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. మరోపక్క మార్చి 30న పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 12న ఇంటర్మీడియట్ పరీక్షలు, 27 నుంచి పదో తరగతి పరీక్షలు, వివిధ యూనివర్సిటీల పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలంటే కష్టమనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి కనుక రిజర్వేషన్లు ప్రకటించారని, పరీక్షలు, సాధారణ ఎన్నికలు తదితర కారణాలు చూపి పురపాలక సంఘాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం మెండుగా ఉందనేది అధికారుల వాదన. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం పైనే పురపాలక సంఘాల ఎన్నికలు ఆధారపడి ఉంటాయని, ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు వస్తే వాటిని పాటించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.