మున్సి‘పోల్స్’ వీడని ఉత్కంఠ
- ఎన్నికల నిర్వహణపై సందేహాలు
- వాయిదా పడొచ్చంటున్న అధికారులు
- సాధారణ ఎన్నికలు, పరీక్షలు కారణం!
- తుది నిర్ణయం నేడే
మున్సిపల్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు, నాలుగు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేదా అనే అంశం చర్చనీయాంశమైంది. నిర్ణయం ఏదైనా ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించే అవకాశముంది. ఎన్నికలు జరిగితే నిర్వహణ పరంగా అధికారులకు, పోటీ పరంగా రాజకీయ నేతలకు ఇబ్బందికరమే.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మరో మూడు, నాలుగు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సాధారణ ఎన్నికలు జరుగుతున్న రోజుల్లో పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించటం కష్టసాధ్యమనే భావన అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పలువురు ఎదురుచూస్తున్నారు. సాధారణ ఎన్నికలు జరిగే తరుణంలో పురపాలక సంఘ ఎన్నికలు జరిగితే రాజకీయ నాయకులకు తలనొప్పులు తప్పవనే భావన పలువురి నుంచి వ్యక్తమవుతోంది.
ప్రకటన నేడే...
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి సోమవారం పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేస్తారని మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో అన్ని రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, పురపాలక సంఘాల్లో చైర్మన్ పదవికి రిజర్వేషన్లను శనివారం గవర్నర్ ఆమోదించారు. సాధారణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించటం కష్టమని, దీనిపై కోర్టుకు ఎన్నికల కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మచిలీపట్నం, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట, గుడివాడ మునిసిపాల్టీలకు, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అధికారులకు తలనొప్పే...
సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరగవని అధికారులు పేర్కొంటున్నారు. రెండు ఎన్నికలకు సిబ్బందిని కేటాయించటం ప్రహసనంగానే ఉంటుందని వారు చెబుతున్నారు. పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పిందని, ఈ తీర్పుపై ఫుల్ బెంచ్‌కు వెళ్లే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు.
మరోపక్క మార్చి 30న పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 12న ఇంటర్మీడియట్ పరీక్షలు, 27 నుంచి పదో తరగతి పరీక్షలు, వివిధ యూనివర్సిటీల పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలంటే కష్టమనే అభిప్రాయం అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి కనుక రిజర్వేషన్లు ప్రకటించారని, పరీక్షలు, సాధారణ ఎన్నికలు తదితర కారణాలు చూపి పురపాలక సంఘాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం మెండుగా ఉందనేది అధికారుల వాదన. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం పైనే పురపాలక సంఘాల ఎన్నికలు ఆధారపడి ఉంటాయని, ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు వస్తే వాటిని పాటించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు.