అశోక్ ముందు పంచాయితీ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎదుట నేడు విజయనగరం టీడీపీ పంచాయితీ జరగనుంది. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటుండటంతో వ్యవహారం రచ్చకెక్కింది.ఇప్పటికే ఎమ్మెల్యే మీసాల గీత,మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగడమే కాకుండా ఎవరికి వారు తమ చర్యల్ని అమలు చేస్తున్నారు. మున్సిపాల్టీలో ఏం జరిగినా తనకు తెలిసే జరగాలని మీసాల గీత పట్టుబడుతుండగా, తనకు నచ్చిన రీతిలో నడవాలని ప్రసాదుల రామకృష్ణ ప్రతిష్టకు పోతున్నారు. ఇటీవల కమిషనర్ చాంబర్లో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే తన పవరేంటో చూపించారు.
ఆ సమయంలో ప్రసాదుల పెద్దగా మాట్లాడకపోయినా ఆ తర్వాత పలు విషయాలపై ్రపశ్నించిన 24వ వార్డు రొంగలి రామారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. ఒకానొక సందర్భంలో నీ అంతు చూస్తానంటూ రొంగలి రామారావును హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మున్సిపాల్టీలో ఎమ్మెల్యే, చైర్మన్ మధ్యనే కాకుండా ఎమ్మెల్యే-కౌన్సిలర్ల మధ్య, చైర్మన్- కౌన్సిలర్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఆ మధ్య కొందరు కౌన్సిలర్లు ఆ ఇద్దర్నీ వ్యతిరేకిస్తూ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డారు.
ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలాగే, ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలో కూడా విభేదాలు తలెత్తాయి. కొందరు సైలాడ త్రినాథరావుకు ఇవ్వాలని,మరికొందరు కర్రోతు నర్సింగరావుకు ఇవ్వాలని, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరును ప్రతిపాదిస్తూ గ్రూపులు కట్టారు. ఇలా అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతుంటే ప్రజల్లో చులకన భావం పెరుగుతుందంటూ పట్టణ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వీఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుని విజయనగరంలో నేతల మధ్య సమన్వయం రావాలని, దీనికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశోక్ గజపతిరాజును కోరినట్టు తెలిసింది.
ఆ మేరకు ఆదివారం ఉదయం 10గంటలకు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు అశోక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సమావేశానికి హాజరు కావాల్సిన నాయకులకు శనివారం రాత్రి సమాచారం అందించారు. ముఖ్యంగా మున్సిపాల్టీలో పరిపాలన కుంటు పడిందని, ఏ ఒక్క అభివృద్ధీ జరగలేదని, పాలనా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోందని పలువురు విరుచుకుపడనున్నారు. అలాగే, వారి వారి భాగోతాలను బయట పెట్టుకోనున్నారు. మరి, ఈ పంచాయితీలో ఏం తేలనుందో చూడాలి.