ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) కొత్తగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో నాయకత్వాన్ని మార్చి, నూతన నేతలకు బీజేపీ అధికారాన్ని అప్పగించింది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నేపధ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌ల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ మీడియా కార్యక్రమంలో సమాధానమిచ్చారు.
ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీ సీనియర్ నేతలని, వారి స్థాయికి అనుగుణంగా భవిష్యత్తులో పార్టీ వారికి తగిన హోదా కల్పిస్తుందని అన్నారు. తమ పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని, ప్రతిచిన్న కార్యకర్తకు కూడా పార్టీ తగిన స్థానం ఇస్తుందని అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని, ఆ సీనియర్లకు మరో పనిని అప్పగిస్తామన్నారు. వారి సేవలను పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ ప్రశ్నకు సమాధానం కొన్ని పదాలలో వివరించడం కష్టమని, ఇటువంటి పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అని మాత్రమే కాకుండా ప్రతి కార్యకర్త గురించి కూడా పార్టీ ఆలోచిస్తుందని నడ్డా తెలిపారు. వారు చేపట్టిన కార్యక్రమాలు, వారి చరిత్రకు సంబంధించిన డేటా బ్యాంక్ తమ వద్ద ఉందని, వాటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటామన్నారు. ఎన్నికలు ప్రకటించగానే మన నాయకుడెవరు? ప్రతిపక్షంలో కూర్చోగల తగిన నాయకుడు ఎవరు? అనే అంశంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని, ఈ ఎంపిక చాలా జాగ్రత్తగా జరుగుతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మాస్క్ మళ్లొచ్చింది.. సింగపూర్‌లో షురూ!