చిరస్మరణీయం
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.
ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మస్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు అనేవారు రమణ మహర్షి. ఇంతకీ ఎవరీ రమణ మహర్షి? గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా నిలిచి సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని అందించినా... రమణ పథం చాలా భిన్నమైనది. ఆ రమణుని చెంత సేదతీరి తమ ఐహిక దుఃఖాలను, ఆధ్మాత్మిక తృష్ణను తీర్చుకునేందుకు వందలాది జనం నిత్యం అరుణాచలానికి బారులు తీరేవారు.
భక్తులు అడిగే ప్రతి ప్రశ్నకూ రమణులు తనదైన శైలిలో జవాబుని అందించేవారు. వాటిలో చాలావరకూ జవాబులు ‘నిన్ను నువ్వు ముందుగా తెలుసుకో’ అన్న సూచనతో ముగిసేవి. మరికొన్ని సందర్భాలలో రమణులు తనంతట తానుగా ఏదో ఒక విషయం గురించి అభిప్రాయాన్ని వెల్లడించేవారు. వెంకట రామన్ అనే పేరున్న రమణులకు అసలు ఆ పేరెలా వచ్చిందో చూద్దాం...ఒకసారి తపస్సు కోసమని తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లాడు కావ్యకంఠ గణపతి ముని. అక్కడ అరుణగిరిపై వెలిసిన అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనీ దర్శించుకున్నాడు. ‘‘శక్తి, ఈశ్వరుడు ఇక్కడ నాకు పూర్ణానుగ్రహ స్వరూపులై కనిపిస్తున్నారు. నా తపస్సు ఇక్కడే సిద్ధి పొందుతుంద’’ని తన సోదరునితో చెప్పారు గణపతిశాస్త్రి. మరోసారి తిరువణ్ణామలై వెళ్లి రోజులకు రోజులు తపస్సులో నిమగ్నమయ్యాడు గణపతి. ఒకరోజు హఠాత్తుగా అరుణాచలంపై ఉన్న మౌనస్వామి గుర్తుకువచ్చారు. మూడు నాలుగేళ్లకిందట తాను స్వామిని ఒకసారి దర్శించుకున్నాడు. మళ్లీ స్వామిని దర్శించుకోవడానికి మండుటెండలో అరుణగిరి ఎక్కనారంభించారు. విరూపాక్ష గుహ బయట స్వామి ఒక్కరే ఒక తిన్నెపై కూర్చుని ఉన్నారు.
ఆయన పాదాలను పట్టుకున్నాడు గణపతి. కన్నీరు కారుస్తూ.. ‘‘స్వామీ! మనసారా తపస్సు చేశాను. అయినా దేవుడు ప్రసన్నుడు కాలేదు. నా సాధనలో ఏదో లోపం ఉందనిపిస్తోంది! తపస్సు స్వరూపం ఏమిటో అనుగ్రహించండి’’ అని కోరాడు. గణపతి ప్రార్థనను ఆలకించిన మౌనస్వామి.. ‘‘నాయనా! ‘నేను’ అనే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తున్నదో విచారిస్తే... మనసు అందులో అణగిపోతుంది. అదే తపస్సు. మంత్ర శబ్దోత్పత్తి ఎక్కడ జరుగుతుందో గమనిస్తే.. మనసు అందులో లీనమవుతుంది. అదే తపస్సు’’ అని ఉపదేశించాడు. ఆ ఉపదేశంతో పొంగిపోయిన గణపతి ముని... స్వామి పరిచారికుడు పళనిస్వామిని అడిగి స్వామి పేరు వెంకటరామన్ అని తెలుసుకున్నాడు. ఆ పేరుని ‘రమణ’గా సంక్షిప్తం చేశారు గణపతి. మోక్షానికి దారి చూపారు కాబట్టి ‘మహర్షి’ అనీ.. సర్వమంగళ ప్రదాత కావున ‘భగవాన్’ అనీ స్ఫురించేలా స్వామికి.. ‘భగవాన్ శ్రీ రమణ మహర్షి’ అని నామకరణం చేశారు. మహర్షిని తన గురువుగా స్వీకరించారు. ఆ తర్వాత వెంకటరామన్ పేరు ‘రమణ మహర్షి’గా స్థిరపడిపోయింది.
సందేశ రమణీయం
మహర్షిని దర్శించుకోవడానికి ఎందరో సాధకులు వస్తూ ఉండేవారు. వాళ్లడిగిన ప్రశ్నలు, మహర్షి ఇచ్చిన సమాధానాలతో ‘శ్రీరమణ గీత’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు గణపతి ముని. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం. ∙మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏదీ లేదో అదే ఉన్నదని, యథార్ధానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసుమాట వినకుండా, హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్నదానిని చూసుకుంటే, ఇక బయట ప్రత్యేకంగా చూసుకుని ఆనందించవలసిన అవసరం లేదు. ∙‘ఈ ప్రపంచం సుఖం కోసం సృష్టించబడిందా? దుఃఖం కోసం సృష్టించబడిందా?’ అనే ప్రశ్న గురించి రమణులు ఏం చెప్పారంటే... ‘సృష్టి మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది ఉన్నట్లే ఉన్నది. మానవుని మనస్సు దానిని తన కోణం నుంచి చూస్తూ తనకు అనుకూలమైనట్లు వ్యాఖ్యానిస్తుంది.
∙మానవుడి మనస్సే కష్టాలను సృష్టించుకుని సహాయం కోసం అలమటిస్తూ ఉంటుంది. ఒక మనిషికి కష్టాలిచ్చి మరొకడికి సుఖాలీయటానికి భగంతుడికంత పక్షపాతం ఉంటుందా? ∙సృష్టిలో అన్నిటికీ చోటు ఉంటుంది. కానీ పక్కనే రుచికరమైన తిండి ఉండగా ఒక క్షుథార్తుడు దానివైపు చేయిజాపి ఆకలి తీర్చుకోకుండా ఉన్నట్లు, మానవుడు çసృష్టిలో ఉండే మంచివాటినీ, ఆరోగ్యకరమైన వాటినీ, సుందరమైనవాటినీ వదలిపెట్టి ఊరకే దుఃఖిస్తూ ఉంటాడు. కాని మనుష్యుల అదృష్టం కొద్దీ, భగవంతుడు అనంతదయాసాగరుడై మానవుని ఎన్నడూ వదిలిపెట్టడు. ఎల్లప్పుడూ గురువులనూ, శాస్త్రాలనూ ఇచ్చి, కొత్త అవకాశాలను ఇచ్చి, మార్గం చూపించి తన తప్పులను తెలుసుకొనేలా చేసి తుదకు శాశ్వతానందాన్ని ప్రసాదిస్తాడు.
∙ చాలామంది సంతోషం బయట నుంచి వస్తుందనీ, భౌతికమైన సంపదలతో ఏర్పుడుతుందనీ అనుకుంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగేట్లయితే సంపద పెరుగుతున్న కొద్దీ అది పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేనివాడి దగ్గర సంతోషం అనేదే ఉండకూడదు. కానీ నిజంగా అలా జరుగదు కదా! మనిషి ఏ సంపదనీ అనుభవించలేని... కనీసం శరీరస్పృహ కూడా లేని నిద్రావస్థలో చాలా సంతోషంగా ఉంటాడు. అలాంటి స్థితి కోసమే తనకు గాఢంగా నిద్ర పట్టాలని కోరుకుంటాడు. దీనిని బట్టి సంతోషం మనిషి అంతరంగంలోనే ఉందని తేలిపోతోంది కదా! మనల్ని మనం తెలుసుకున్న రోజున, అలాంటి స్వచ్ఛమైన సంతోషాన్ని నిరంతరం పొందగలుగుతాము.
– డి. పూర్ణిమాస్వాతి