నిశ్చలత్వమే యోగం
ఆత్మీయం
ఈ భౌతిక ప్రపంచంలో మంచి జరిగినా, చెడు జరిగినా తాము దాన్ని ప్రశంసించకుండా, విమర్శించకుండా ఎవరైతే ఉంటారో, ఎటువంటి భావాన్నీ వెలిబుచ్చక కలత చెందక నిశ్చలంగా ఉంటారో అటువంటి వారినే యోగులంటారు. నిలకడగల జ్ఞాని లేదా యోగి తాబేలు వంటివాడు. ఏదైనా అవసరం కలిగినప్పుడు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునే సౌకర్యం ఏవిధంగా కలిగి ఉంటుందో, అదేవిధంగా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే సమగ్రమైన జ్ఞాని, యోగి.
సమదర్శనులు రమణమహర్షి వలె జనన మరణ స్థితులను జయించిన వారై ఉంటారు. అటువంటి సమదర్శనులయిన జ్ఞానుల చేత ఈ దేహం, సంసార బంధాలలో తగులుకోక జనన మరణ చక్రాన్ని జయించబడింది. అటువంటి వారు బ్రహ్మమువలె దోషం లేని వారయినందువల్ల బ్రహ్మములోనే ఉన్నవారు కాగలరు. అంటే అన్నింటిలోనూ సమదృష్టి గల మనస్సు, ఆత్మ సాక్షాత్కారం గల వారి çహృదయానికి ప్రతీకయే గాక సాక్షాత్తూ దేవుని వలె రాగద్వేషాలకు అతీతులం కాగలం. దోషరహితులమై ఆధ్యాత్మికానందాన్ని అనుభవించగలం.