ramanathapuram district
-
ప్రియురాలు దూరం, 3 లక్షలు ఫైన్, ప్రియుడి సజీవదహనం
సాక్షి, తిరువొత్తియూరు : కులాంతర ప్రేమ ఇద్దరు ప్రేమికుల్ని బలిగొంది. ప్రేమికుడి కుటుంబానికి పంచాయితీ చేసిన ఓ రాజకీయ ప్రముఖుడు రూ.3 లక్షలు జరిమానా విధించారు. ప్రేమికుల్ని విడదీశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియురాలు నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ప్రియుడు సైతం ఆమె జ్ఞాపకాలు తలచుకుంటూ కుంగిపోయాడు. చివరకు అతనూ ప్రియురాలి తరహాలోనే నిప్పంటించుకుని తనువు చాలించాడు. వివరాలు..రామనాథపురం జిల్లా కేల్ కరై సమీపం పనయం గాడుకు చెందిన ప్రవీణ్ (20), కూలాంకులానికి చెందిన నంబుగులాంతో పరిచయం కలిగింది. కళాశాలలో చదువుతున్న సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వేర్వేరు కులాలు. ప్రేమజంట వ్యవహారం తెలుసుకున్న బి.కీరందయి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలి భర్త అయిన అన్నాడీఎంకే నాయకుడు అర్పుదరాజ్ పంచాయితీ చేశాడు. ప్రేమికులిద్దరినీ విడదీశాడు. అంతేకాకుండా ప్రవీణ్ కుటుంబం రూ. 3 లక్షలు జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశాడు. ఈ వ్యవహారాలతో కలత చెందిన నంబుగులా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రవీణ్ కుంగిపోయాడు. రెండు నెలల తరువాత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తానూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటలు తాళలేక అతను కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి, అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: సినిమా తరహా పక్కా స్కెచ్: అనాథగా అవతారమెత్తి.. -
నిండు ప్రాణాలు బలిగొన్న వన్‌సైడ్ లవ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ ప్రేమోన్మాది వన్‌సైడ్ లవ్ ఒక అమాయక విద్యార్థిని నిండు ప్రాణాలను బలికొంది. తనకు దక్కని యువతి ఎవరికీ దక్కకూడదనే ఉక్రోషంతో ఆమె గొంతుకోసి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపం అడుత్తకుడి గ్రామానికి చెందిన పళనిస్వామి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి, కుమార్తె ధరణి (19) గ్రామంలో ఉంటున్నారు. శివగంగై జిల్లా మహిళా కళాశాలలో ధరణి బీఏ ఫస్టియర్ చదువుతోంది. వీరి పొరుగింటిలో నివసించే బంధువు సేతురామన్ కుమారుడు కుమార్ (29) చెన్నైలో లెదర్ సంచులు కుడుతూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా ధరణిపై ప్రేమ పెంచుకున్న కుమార్ తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఆరు నెలల క్రితం తన బంధువులతో కలిసి ధరణి ఇంటికి వెళ్లి సంబంధం కోరాడు. కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ధరణి తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తరువాత పదే పదే ధరణి వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి గొడవ పడేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా ధరణి తల్లి, అన్న కలిసి కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ధరణి తల్లి మహేశ్వరి, అన్న ధర్మలింగం ఆదివారం ఊరికి వెళ్లగా, కాలేజీకి సెలవు కావడంతో పెరటి తలుపును తెరచి ఉంచి ధరణి ఇంటిలో ఒంటరిగా నిద్రించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుమార్ ఇంట్లోకి చొరబడి తలుపులకు లోపలి నుంచి తాళం వేశాడు. అనంతరం టీవీ ఆన్ చేసి వాల్యూమ్ పెద్దగా పెంచాడు. ఇంతలో ధరణి మేల్కోగా కుమార్ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో విచక్షణా రహితంగా ఆమె గొంతు నరికివేయడంతో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది.