ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరువొత్తియూరు : కులాంతర ప్రేమ ఇద్దరు ప్రేమికుల్ని బలిగొంది. ప్రేమికుడి కుటుంబానికి పంచాయితీ చేసిన ఓ రాజకీయ ప్రముఖుడు రూ.3 లక్షలు జరిమానా విధించారు. ప్రేమికుల్ని విడదీశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియురాలు నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ప్రియుడు సైతం ఆమె జ్ఞాపకాలు తలచుకుంటూ కుంగిపోయాడు. చివరకు అతనూ ప్రియురాలి తరహాలోనే నిప్పంటించుకుని తనువు చాలించాడు.
వివరాలు..రామనాథపురం జిల్లా కేల్ కరై సమీపం పనయం గాడుకు చెందిన ప్రవీణ్ (20), కూలాంకులానికి చెందిన నంబుగులాంతో పరిచయం కలిగింది. కళాశాలలో చదువుతున్న సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ వేర్వేరు కులాలు. ప్రేమజంట వ్యవహారం తెలుసుకున్న బి.కీరందయి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలి భర్త అయిన అన్నాడీఎంకే నాయకుడు అర్పుదరాజ్ పంచాయితీ చేశాడు. ప్రేమికులిద్దరినీ విడదీశాడు. అంతేకాకుండా ప్రవీణ్ కుటుంబం రూ. 3 లక్షలు జరిమానా చెల్లించాలని హుకుం జారీ చేశాడు.
ఈ వ్యవహారాలతో కలత చెందిన నంబుగులా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రవీణ్ కుంగిపోయాడు. రెండు నెలల తరువాత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తానూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటలు తాళలేక అతను కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి, అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment