ramayana circuit
-
లంక వరకు రామాయణ యాత్ర చేస్తారా.. ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!
రైల్లో రామాయణ యాత్ర చేయాలనుకుంటున్నారా..? శ్రీరామునికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘శ్రీ రామాయణ యాత్ర’ను ఏప్రిల్ 7న ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా ప్రారంభించనుంది. శ్రీ రామాయణ యాత్ర అనేది రామాయణ సర్క్యూట్‌లోని భరత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు థీమ్ ఆధారిత తీర్థయాత్ర. రామాయణానికి సంబంధించి భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీలంకను కూడా సందర్శించాలనుకునే వారికి కూడా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ రైలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ నుంచి బయలుదేరి అయోధ్య, జనక్‌పూర్, సీతామధి, బక్సర్, వారణాసి, మాణిక్పూర్ జంక్షన్, నాసిక్ రోడ్ హోస్పేట్, రామేశ్వరం, భద్రాచలం రోడ్, నాగ్‌పూర్ స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసి తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్, ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, ఇటావా, కాన్పూర్, లక్నో స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. విరంగని లక్ష్మీ బాయి, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో దిగిపోవచ్చు. ఫస్ట్ ఏసీ కపుల్ సీట్ల ధర (ఇద్దరికి) రూ.1,68,950. ఫస్ట్ ఏసీ క్యాబిన్ సీట్ల ధర రూ. 1,03,020 నుంచి రూ. 1,61,645 ఉంటుంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి ఇక అటు నుంచి అటే శ్రీలంకను కూడా సందర్శించాలనుకునేవారు నాగ్‌పూర్ నుంచి నేరుగా శ్రీలంక వెళ్లవచ్చు. ఏప్రిల్ 23న దేశంలో రామాయణ యాత్ర నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ముగుస్తుంది. అక్కడి నుంచి రైలు ఢిల్లీకి బయలుదేరుతుంది. శ్రీలంక పర్యటనకు వెళ్లేవారు కొలంబోకు వెళ్లడానికి నాగ్‌పూర్ విమానాశ్రయానికి వెళతారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కరికి రూ. 82,880, ఇద్దరికయితే రూ.69,620 (ఒక్కొక్కరికి) , అదే ముగ్గురుంటే ఒక్కొక్కరికీ రూ.67,360 చొప్పున ఉంటుంది. -
వినరో భాగ్యము..
పర్ణశాల.. ఇక వర్ణశోభితం! - కళ్ల ముందు కదలాడనున్న కమనీయ రామాయణం - ‘రామాయణ సర్క్యూట్’లో భాగంగా అభివృద్ధి - త్రీడీ దృశ్య రూప వ్యవస్థ.. అరణ్యకాండను తెరలపై చూపే ఏర్పాట్లు - కొత్తగూడెం విమానాశ్రయంతో అనుంధానం.. ప్రభుత్వ ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: సీతమ్మ ఆరేసుకున్న నార చీర అదిగో. ఆ చెట్టు పక్కనే ఆమె బంగారు లేడిని చూశారట. ఇదిగో ఇక్కడే శూర్పనఖ ముక్కుచెవులను లక్ష్మణుడు కోసింది. రావణుడు మాయ వేషంలో భిక్ష అర్థించి సీతను అపహరించిన పర్ణశాల ఇదేనట.. ..ఇలా పర్యాటక భక్తులు చెప్పుకునే చోటు పర్ణశాల. రామాయణం అరణ్యకాండలో ప్రధాన ఘట్టానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భాసిల్లుతున్న ఆ ప్రాంతం భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలో ఉంది. పురాణ గాధలో దానికున్న ప్రాధాన్యం ఎంతో! కానీ, భక్తి పారవశ్యంతో వెళ్లే భక్తులకు అక్కడ తీవ్ర నిరాశ తప్పడం లేదు. కనీస వసతులూ కరువే. ఇప్పుడు దాని రూపురేఖలను మార్చి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక–ఆధునిక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దే ప్రణాళికలకు రూపకల్పన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా రామాయణ్ సర్క్యూట్ పేరుతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భక్తులు వచ్చేందుకు రోడ్డు, ఉండేందుకు విశ్రాంతి గదులు, రెస్టారెంట్ ఉంటే సరిపోదు, ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే ఇతివృత్తం అవసరం. ఇప్పుడు దాని విషయంలోనే మేధోమథనం జరుగుతోంది. భారీ త్రీడీ దృశ్య వ్యవస్థ... లేనిది ఉన్నట్టుగా.. మన కళ్లముందే జరుగుతుందన్నట్టుగా అనుభూతి కలిగించే త్రీడీ దృశ్య వ్యవస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో కనువిందు చేస్తోంది. ఇలాంటి వ్యవస్థను పర్ణశాలలో ఏర్పాటు చేయాలనే ప్రాథమిక ఆలోచనపై కసరత్తు జరుగుతోంది. డిస్నీలాండ్‌లోని ఇలాంటి ఏర్పాట్లను చూసిన పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అదే తరహా పర్ణశాలలో ఉంటే బాగుంటుందని సూచించారు. ఆ దిశగా నిపుణులు కసరత్తు చేస్తున్నారు. అరణ్యకాండకు సంబంధించిన పూర్తి ఇతివృత్తాన్ని ప్రత్యేక త్రీ డీ తెరలపై చూపే ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు వాటి మధ్య నుంచి ముందుకు సాగేందుకు ప్రత్యేక కన్వేయర్ బెల్టు వ్యవస్థ ఉంటుంది. దానిపై కూర్చొని ముందుకు వెళ్తుంటే.. అరణ్యకాండ మొత్తం కళ్ల ముందు కదలాడుతుంది. ఇందుకు దాదాపు 20కిపైగా ప్రత్యేక తెరల వ్యవస్థ, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అండర్‌వాటర్ ఎక్వేరియం తరహాలో ఏర్పాటు చేసే మరో ఆలోచన కూడా ఉంది. ఇక నాటి ఘట్టాలను ప్రతిబింబించే ఆనవాళ్లను మరింత మెరుగ్గా కనిపించేలా చేస్తారు. భక్తులు ఉండేందుకు వీలుగా దాదాపు 30 వరకు కాటేజీలు, భోజనశాలలు, బ్యాటరీ వాహనాలు, ఉద్యానవనాలు, పిల్లల పార్కులు ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయంతో అనుసంధానం ఇటీవలే కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు పౌర విమానయానశాఖ పచ్చజెండా ఊపింది. పనులు వెంటనే మొదలయ్యేలా ఈ ప్రాజెక్టులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రామాయణ్ సర్క్యూట్ కింద ఇచ్చిన నిధులను రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచాలని కోరనున్నారు. ప్రాజెక్టులో ఇతర ప్రతిపాదిత ప్రాంతాలు ► భద్రాచలం క్షేత్రం వద్ద ప్రత్యేక వసతి కేంద్రాల నిర్మాణం ► ఆ ఆలయాన్ని నిర్మించిన రామదాసు సొంత ప్రాంతం నేలకొండపల్లిలో స్మారక కేంద్రం ► రామదాసు తహసీల్దారుగా పనిచేసిన పాల్వంచలో స్మృతి కేంద్రం ► శ్రీరాముడు మాయలేడిని వధించిన ప్రాంతంగా చెప్పుకునే జీడికల్ రామాలయం అభివృద్ధి. భక్తులకు వసతి కేంద్రాలు ► సీతాన్వేషణలో భాగంగా రాముడు విశ్రమించినట్టుగా పేర్కొనే ఇల్లంతకుంట ప్రాంతంలో అభివృద్ధి పనులు ► రాముడు నడయాడిన గుర్తులున్నాయని పేర్కొనే రామగిరి ఖిల్లా. కాళిదాసు మేఘసందేశం ఇక్కడే రాశారంటారు. ప్రాజెక్టు స్వరూపం రామాయణ గాథతో ముడిపడిన ప్రాంతాలను పర్యాటక వలయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అయోధ్య మొదలు రామసేతు ఉన్న రామేశ్వరం వరకు రామాయణ ఇతివృత్తం చోటుచేసుకున్న ప్రాంతాలుగా పేర్కొనే పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయబోతోంది. స్వదేశీ దర్శన్ కింద రామాయణ్ సర్క్యూట్ పేరుతో దేశంలోని 11 ప్రాంతాలను గుర్తించింది. అవి.. ఉత్తరప్రదేశ్ : అయోధ్య, నందిగ్రామ్, శృంగవర్పూర్, చిత్రకూట్ బిహార్ : సీతార్మర్హి, బక్సర్, దర్భంగ ఛత్తీస్‌గఢ్ : జగ్దల్పూర్ తమిళనాడు : రామేశ్వరం కర్ణాటక : హంపి మహారాష్ట్ర : నాసిక్, నాగ్‌పూర్ ఒడిశా : మహేంద్రగిరి మధ్యప్రదేశ్: చిత్రకూట్ తెలంగాణ : పర్ణశాల -
యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ‘రామ బాణం’
► రామాయణ సర్క్యూట్‌తో అయోధ్య అభివృద్ధి లక్నో: అయోధ్యలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘రామాయణ సర్క్యూట్’ పేరిట కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 245 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాలని ప్రాథమికంగా అంచనా వేసింది. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ఫథకాన్ని చేపడుతోందన్నది నిర్వివాద అంశం. అయితే అయోధ్యలో రామాలయం-బాబ్రీ మసీదు వివాదం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండడంతో ఈ రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టు కూడా రాజకీయ దుమారాన్ని రేపుతుందనడంలో సందేహం లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించినప్పుడల్లా రామ మందిరం అంశాన్ని తెరపైకి తీసుకరావడం బీజేపీకి, దాని సంఘ్ పరివారంకు మొదటి నుంచి అలవాటే. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉన్నందున వివాదాస్పద రామమందిరం అంశాన్ని నేరుగా ప్రస్థావించకుండా ఇలా రామాయణ సర్క్యూట్ పేరిట అయోధ్యతోపాటు రాముడి జీవితానికి సంబంధించిన అన్ని సంఘటనలను ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అటు సంఘ్ పరివారంను ఇటు హిందువులను సంతృప్తి పర్చాలన్నది మోదీ అభిమతంగా కనిపిస్తోంది. రామాయణ సర్క్యూట్లో భాగంగా రాముడి జీవిత విశేషాలకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 11 ప్రదేశాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, నందిగామ్, ష్రింగవర్పూర్, చిత్రకూట్‌లను తొలి రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశల్లో బీహార్‌లోని సీతమ్రాహి, బక్సర్, దర్భాంగలను, చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, తెలంగాణలోని భద్రాచలం, కర్ణాటకలోని హంపి, తమిళనాడులోని రామేశ్వరంలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్, మహారాష్ట్రలోని నాసిక్, నాగపూర్లు, ఒడిశాలోని మహేంద్రగిరీలను కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెల్సింది. రాముడు, లక్ష్మణుడు, సీత దేవతామూర్తుల భారీ విగ్రహాలతోపాటు వాల్మీకి, తులసీదాస్ భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, రాముడు సతీసమేతంగా వనవాసానికి వెళుతూ గంగా నదిని దాటినట్టుగా భావిస్తున్న ప్రాంతాల్లో భక్తుల కోసం అత్యాధునిక స్నాన ఘట్టాలను నిర్మించాలని ప్రతిపాదించారు. రాముడి జీవితానికి సంబంధించి పది ఘట్టాలను తెలియజేయడానికి వీలుగా అయోధ్యలో ఆడియో, వీడియో విజువల్స్‌తో భారీ గ్యాలరీ కూడా నిర్మించాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, లంకా కాండ, ఉత్తరకాండ, లవకుశకాండ, రామ్దర్బార్లను ప్రతిబింబించేలా ఉండాలని నిర్ణయించినట్లు తెల్సింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలుస్తోంది. స్వదేశీ దర్శన్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యాటక సర్క్యూట్లో భాగంగానే ఈ రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి నిర్మాణ పనులు కొలిక్కి రావాలని కేంద్రం భావిస్తోంది.