యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ‘రామ బాణం’ | NDA plays ramayana circuit as key to UP assembly elections | Sakshi
Sakshi News home page

యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ‘రామ బాణం’

Published Tue, Jul 5 2016 4:53 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ‘రామ బాణం’ - Sakshi

యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ‘రామ బాణం’

రామాయణ సర్క్యూట్‌తో అయోధ్య అభివృద్ధి

లక్నో: అయోధ్యలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘రామాయణ సర్క్యూట్’ పేరిట కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 245 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాలని ప్రాథమికంగా అంచనా వేసింది. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ఫథకాన్ని చేపడుతోందన్నది నిర్వివాద అంశం. అయితే అయోధ్యలో రామాలయం-బాబ్రీ మసీదు వివాదం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉండడంతో ఈ రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టు కూడా రాజకీయ దుమారాన్ని రేపుతుందనడంలో సందేహం లేదు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించినప్పుడల్లా రామ మందిరం అంశాన్ని తెరపైకి తీసుకరావడం బీజేపీకి, దాని సంఘ్ పరివారంకు మొదటి నుంచి అలవాటే. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉన్నందున వివాదాస్పద రామమందిరం అంశాన్ని నేరుగా ప్రస్థావించకుండా ఇలా రామాయణ సర్క్యూట్ పేరిట అయోధ్యతోపాటు రాముడి జీవితానికి సంబంధించిన అన్ని సంఘటనలను ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అటు సంఘ్ పరివారంను ఇటు హిందువులను సంతృప్తి పర్చాలన్నది మోదీ అభిమతంగా కనిపిస్తోంది.

రామాయణ సర్క్యూట్‌లో భాగంగా రాముడి  జీవిత విశేషాలకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 11 ప్రదేశాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, నందిగామ్, ష్రింగవర్‌పూర్, చిత్రకూట్‌లను తొలి రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత దశల్లో బీహార్‌లోని సీతమ్‌రాహి, బక్సర్, దర్భాంగలను, చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, తెలంగాణలోని భద్రాచలం, కర్ణాటకలోని హంపి, తమిళనాడులోని రామేశ్వరంలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్, మహారాష్ట్రలోని నాసిక్, నాగపూర్‌లు, ఒడిశాలోని మహేంద్రగిరీలను కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెల్సింది.


రాముడు, లక్ష్మణుడు, సీత దేవతామూర్తుల భారీ విగ్రహాలతోపాటు వాల్మీకి, తులసీదాస్ భారీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, రాముడు సతీసమేతంగా వనవాసానికి వెళుతూ గంగా నదిని దాటినట్టుగా భావిస్తున్న ప్రాంతాల్లో భక్తుల కోసం అత్యాధునిక స్నాన ఘట్టాలను నిర్మించాలని ప్రతిపాదించారు. రాముడి జీవితానికి సంబంధించి పది ఘట్టాలను తెలియజేయడానికి వీలుగా అయోధ్యలో ఆడియో, వీడియో విజువల్స్‌తో భారీ గ్యాలరీ కూడా నిర్మించాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, లంకా కాండ, ఉత్తరకాండ, లవకుశకాండ, రామ్‌దర్బార్‌లను ప్రతిబింబించేలా ఉండాలని నిర్ణయించినట్లు తెల్సింది.

కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలుస్తోంది. స్వదేశీ దర్శన్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పర్యాటక సర్క్యూట్‌లో భాగంగానే ఈ రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టును చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి నిర్మాణ పనులు కొలిక్కి రావాలని కేంద్రం భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement