వినరో భాగ్యము.. | Beautiful Ramayana is in front of the eyes in 3D | Sakshi
Sakshi News home page

వినరో భాగ్యము..

Published Wed, Jun 28 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

వినరో భాగ్యము..

వినరో భాగ్యము..

పర్ణశాల.. ఇక వర్ణశోభితం!
- కళ్ల ముందు కదలాడనున్న కమనీయ రామాయణం
‘రామాయణ సర్క్యూట్‌’లో భాగంగా అభివృద్ధి
త్రీడీ దృశ్య రూప వ్యవస్థ.. అరణ్యకాండను తెరలపై చూపే ఏర్పాట్లు
కొత్తగూడెం విమానాశ్రయంతో అనుంధానం.. ప్రభుత్వ ప్రణాళిక
 
సాక్షి, హైదరాబాద్‌: సీతమ్మ ఆరేసుకున్న నార చీర అదిగో. ఆ చెట్టు పక్కనే ఆమె బంగారు లేడిని చూశారట. ఇదిగో ఇక్కడే శూర్పనఖ ముక్కుచెవులను లక్ష్మణుడు కోసింది. రావణుడు మాయ వేషంలో భిక్ష అర్థించి సీతను అపహరించిన పర్ణశాల ఇదేనట..
..ఇలా పర్యాటక భక్తులు చెప్పుకునే చోటు పర్ణశాల. రామాయణం అరణ్యకాండలో ప్రధాన ఘట్టానికి ప్రత్యక్ష సాక్ష్యంగా భాసిల్లుతున్న ఆ ప్రాంతం భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలో ఉంది. పురాణ గాధలో దానికున్న ప్రాధాన్యం ఎంతో! కానీ, భక్తి పారవశ్యంతో వెళ్లే భక్తులకు అక్కడ తీవ్ర నిరాశ తప్పడం లేదు. కనీస వసతులూ కరువే. ఇప్పుడు దాని రూపురేఖలను మార్చి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక–ఆధునిక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దే ప్రణాళికలకు రూపకల్పన జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్‌ పథకంలో భాగంగా రామాయణ్‌ సర్క్యూట్‌ పేరుతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భక్తులు వచ్చేందుకు రోడ్డు, ఉండేందుకు విశ్రాంతి గదులు, రెస్టారెంట్‌ ఉంటే సరిపోదు, ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే ఇతివృత్తం అవసరం. ఇప్పుడు దాని విషయంలోనే మేధోమథనం జరుగుతోంది. 
 
భారీ త్రీడీ దృశ్య వ్యవస్థ...
లేనిది ఉన్నట్టుగా.. మన కళ్లముందే జరుగుతుందన్నట్టుగా అనుభూతి కలిగించే త్రీడీ దృశ్య వ్యవస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో కనువిందు చేస్తోంది. ఇలాంటి వ్యవస్థను పర్ణశాలలో ఏర్పాటు చేయాలనే ప్రాథమిక ఆలోచనపై కసరత్తు జరుగుతోంది. డిస్నీలాండ్‌లోని ఇలాంటి ఏర్పాట్లను చూసిన పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు అదే తరహా పర్ణశాలలో ఉంటే బాగుంటుందని సూచించారు. ఆ దిశగా నిపుణులు కసరత్తు చేస్తున్నారు. అరణ్యకాండకు సంబంధించిన పూర్తి ఇతివృత్తాన్ని ప్రత్యేక త్రీ డీ తెరలపై చూపే ఏర్పాటు చేస్తారు.

పర్యాటకులు వాటి మధ్య నుంచి ముందుకు సాగేందుకు ప్రత్యేక కన్వేయర్‌ బెల్టు వ్యవస్థ ఉంటుంది. దానిపై కూర్చొని ముందుకు వెళ్తుంటే.. అరణ్యకాండ మొత్తం కళ్ల ముందు కదలాడుతుంది. ఇందుకు దాదాపు 20కిపైగా ప్రత్యేక తెరల వ్యవస్థ, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అండర్‌వాటర్‌ ఎక్వేరియం తరహాలో ఏర్పాటు చేసే మరో ఆలోచన కూడా ఉంది. ఇక నాటి ఘట్టాలను ప్రతిబింబించే ఆనవాళ్లను మరింత మెరుగ్గా కనిపించేలా చేస్తారు. భక్తులు ఉండేందుకు వీలుగా దాదాపు 30 వరకు కాటేజీలు, భోజనశాలలు, బ్యాటరీ వాహనాలు, ఉద్యానవనాలు, పిల్లల పార్కులు ఏర్పాటు చేస్తారు.
 
విమానాశ్రయంతో అనుసంధానం
ఇటీవలే కొత్తగూడెం విమానాశ్రయ ఏర్పాటుకు పౌర విమానయానశాఖ పచ్చజెండా ఊపింది. పనులు వెంటనే మొదలయ్యేలా ఈ ప్రాజెక్టులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రామాయణ్‌ సర్క్యూట్‌ కింద ఇచ్చిన నిధులను రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచాలని కోరనున్నారు.
 
ప్రాజెక్టులో ఇతర ప్రతిపాదిత ప్రాంతాలు
భద్రాచలం క్షేత్రం వద్ద ప్రత్యేక వసతి కేంద్రాల నిర్మాణం
ఆ ఆలయాన్ని నిర్మించిన రామదాసు సొంత ప్రాంతం నేలకొండపల్లిలో స్మారక కేంద్రం
రామదాసు తహసీల్దారుగా పనిచేసిన పాల్వంచలో స్మృతి కేంద్రం
శ్రీరాముడు మాయలేడిని వధించిన ప్రాంతంగా చెప్పుకునే జీడికల్‌ రామాలయం అభివృద్ధి. భక్తులకు వసతి కేంద్రాలు
సీతాన్వేషణలో భాగంగా రాముడు విశ్రమించినట్టుగా పేర్కొనే ఇల్లంతకుంట ప్రాంతంలో అభివృద్ధి పనులు
రాముడు నడయాడిన గుర్తులున్నాయని పేర్కొనే రామగిరి ఖిల్లా. కాళిదాసు మేఘసందేశం ఇక్కడే రాశారంటారు.
 
ప్రాజెక్టు స్వరూపం
రామాయణ గాథతో ముడిపడిన ప్రాంతాలను పర్యాటక వలయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అయోధ్య మొదలు రామసేతు ఉన్న రామేశ్వరం వరకు రామాయణ ఇతివృత్తం చోటుచేసుకున్న ప్రాంతాలుగా పేర్కొనే పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయబోతోంది. స్వదేశీ దర్శన్‌ కింద రామాయణ్‌ సర్క్యూట్‌ పేరుతో దేశంలోని 11 ప్రాంతాలను గుర్తించింది. అవి..
ఉత్తరప్రదేశ్‌ : అయోధ్య, నందిగ్రామ్, శృంగవర్‌పూర్, చిత్రకూట్‌
బిహార్‌ : సీతార్‌మర్హి, బక్సర్, దర్భంగ
ఛత్తీస్‌గఢ్‌ : జగ్దల్‌పూర్‌
తమిళనాడు : రామేశ్వరం
కర్ణాటక : హంపి
మహారాష్ట్ర : నాసిక్, నాగ్‌పూర్‌
ఒడిశా : మహేంద్రగిరి
మధ్యప్రదేశ్‌:   చిత్రకూట్‌
తెలంగాణ : పర్ణశాల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement