దీక్ష భగ్నం.. హోంగార్డు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: అంబర్పేటలో హోంగార్డుల దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హోంగార్డుల అసోసియేషన్ తెలంగాణ చైర్మన్ సకినాల నారాయణ ఆధ్వర్యంలో రెండు రోజులుగా హోంగార్డులు అమరణ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు దీక్షను భగ్నం చేయడంతో మనస్తాపం చెందిన హోంగార్డు రమేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులకు, హోంగార్డులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరెస్టైన హోంగార్డులు, ఓయూ, అంబర్పేట పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు సమాచారం.