సీపీఎస్‌ను రద్దు చేయాలి
ఎమ్మెల్సీ రాముసూర్యారావు డిమాండ్
ఆత్రేయపురంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
29న చలో ఢిల్లీ
ఆత్రేయపురం : ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిచాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాముసూర్యారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆత్రేయపురంలో ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 29న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2004 సంవత్సరం సెప్టెంబర్ నుంచి విధుల్లో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో పెన్షన్ భద్రతకు అనుకూలంగా తీర్మానం చేయాలని, పార్లమెంట్లో పీఎఫ్ , ఆర్డీఏలోని అంశాన్ని మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత యూటీఎఫ్, ఎస్టీఎఫ్ఐల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జెఏ ఝూన్సీ, ఎంఈవో లలితాకుమారికి వినతిపత్రాలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు బీవీ రమణ, ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ ప్రసాద్, సహ అధ్యక్షుడు ఎన్. రంగ మహాలక్ష్మి, అసోసియేట్ అధ్యక్షుడు కేడీవీ ప్రసాదరావు, కోశాధికారి ఎం.సురేష్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫణికుమార్, జి.సురేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.