Ramvilas pashwan
-
డిసెంబర్లో హజీపూర్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ: బిహార్‌లోని హాజీపూర్ రాజ్యసభ సీటుకు డిసెంబర్ 14 ఎన్నిక నిర్వహిస్తామని, ఫలితాలు సైతం అదేరోజు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని బిహర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దళిత నాయకుడు ఎంపీ రామ్ విలాస్ పాసవాన్ గుండె పోటుతో మరణించడంతో హాజీపూర్ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానాన్ని తన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ కోసం పాశ్వాన్ వదులుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌కు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2024, ఏప్రిల్ 2 వరకు ఉంది. 74 ఏళ్ల పాశ్వాన్‌కు గత అక్టోబర్ 3న గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది. అక్టోబర్ 8న ఆయన మరణించారు. కాగా, 2014లో రాష్ట్రీయ జనతాదళ్‌తో విడిపోయి ఎన్డీఏతో పాశ్వాన్ జతకట్టారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ.. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేసింది. అయితే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకోవడంతో ఎల్జేపీకి చుక్కెదురైంది. (చదవండి: తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం) -
కేంద్ర మంత్రికి సర్జరీ.. చర్చలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై చర్చలు తుది దశకు చేరుకున్నాయనుకున్న తరుణంలో మరోసారి బ్రేక్ పడింది. లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అగ్ర నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కి అత్యవసరంగా హార్ట్ సర్జరీ నిర్వహించడంతో శనివారం నిర్వహించాల్సిన భేటీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రికి ఇవాళ ఉదయం శస్త్రచికిత్స జరిగిందని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో అవసరమైతే మరో శస్త్ర చికిత్స నిర్వహించే వీలుందని డాక్టర్లు వెల్లడించారని చిరాగ్ చెప్పారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమితో తలపడనుండగా ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు) -
ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం- ఒక రేషన్ కార్డు విధానాన్ని రూపొందించడానికి 2020 జూన్ 30 వరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమయం ఇచ్చింది. ఇది అమల్లోకి వస్తే లబ్ధిదారులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ షాపుల నుంచి సబ్సిడీతో ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర) ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) పోర్టబిలిటీ ద్వారా రేషన్ అందిస్తున్నాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. జూన్ 30, 2020 నాటికి ఒక దేశం- ఒక రేషన్ కార్డు దేశం మొత్తం అమలవుతుందన్నారు. ఈ వ్యవస్థ అమలును వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామని పాశ్వాన్ విలేకరులతో అన్నారు. వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్లినా పేదలు రేషన్ ఎక్కడైనా పొందవచ్చని కొత్త విధానం తెలియజేస్తోంది. నకిలీ రేషన్ కార్డుదారులను కూడా సులభంగా తొలగించడానికి ఈ వ్యవస్థ సహాయపడుతందని తెలిపారు. రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) యంత్రాలను ఏర్పాటు చేసినందున పీడీఎస్ పోర్టబిలిటీని సులభంగా అమలు చేయగలమని పాశ్వాన్ పేర్కొన్నారు. అక్టోబర్-నవంబర్ నుంచి 15 రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో పైలట్ ప్రాతిపదికన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు పాశ్వాన్ ప్రకటించారు. అలాగే నిల్వ నష్టాలను తగ్గించడానికి రాష్ట్రాలు తమ ఆహార ధాన్యం డిపోల కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి ఆరు నెలల గడువు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. -
ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు
న్యూఢిల్లీ: ప్రజలు దేశంలో ఎక్కడ్నుంచి అయినా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు(వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్) విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. ఇందుకు 2020, జూన్ 30 వరకూ గడువిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కేరళ, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్తాన్ రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచైనా తీసుకునే సదుపాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని వెల్లడించారు. ‘2020, జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మేం ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాశాం. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళ్లే నిరుపేదలు రేషన్ సరుకులు పొందలేక ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. మా ప్రభుత్వం తొలి 100 రోజులు ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాం’ అని పాశ్వాన్ పేర్కొన్నారు. రేషన్ కోసం ఆధార్ చూపాల్సిందే.. ఈ నూతన విధానంలో ఓ రాష్ట్రంలోని ప్రజలు మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు రేషన్ సరుకుల కోసం ఆధార్‌కార్డును చూపాల్సి ఉంటుందని పాశ్వాన్ తెలిపారు. తమ పేర్లు రిజస్టరైన రేషన్‌షాపుల్లో అయితే కేవలం రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుందని వెల్లడించారు. ఓ రాష్ట్రంలో ఆహారపదార్థాలను ఉచితంగా అందుకునే వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లినప్పుడు మాత్రం రూ.1 నుంచి రూ.3 వరకు కనీసధరను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ‘రేషన్‌కార్డుదారుల్లో 89 శాతం మంది ఆధార్‌తో అనుసంధానమయ్యారు. దేశవ్యాప్తంగా 77 శాతం రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాల్లోని రేషన్ షాపుల్లో 100 శాతం పీవోఎస్ యంత్రాలను అమర్చారు. కాబట్టి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బందిలేదు’ అని పేర్కొన్నారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పాశ్వాన్ చెప్పారు. కుటుంబంలో ఒకరు మరో రాష్ట్రానికి వలసవెళ్లి మొత్తం రేషన్ సరుకులు అక్కడే కొనేయకుండా 50 శాతం గరిష్ట పరిమితి విధిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని పాశ్వాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 80 కోట్ల మందికి రేషన్‌షాపుల్లో తక్కువ ధరలకే ఆహారపదార్థాలను అందజేస్తోంది. -
నేను ఆయనకు అల్లుడిని కాదా?
రాజకీయ కుటుంబాలు తమ పార్టీల్లోకి కుమారుడి ప్రవేశాన్ని తర్వాత అతడికి పదవి కట్టబెట్టడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రకటించుకుంటున్నాయి. కుటుంబ నేపథ్యంతోనే అతడికి ప్రమోషన్ ఇచ్చారనే విషయాన్ని కనుమరుగు చేస్తున్నాయి. అల్లుళ్లతో బాధలు బిహార్ రాజకీయాలనూ వదిలేటట్టు లేవు. ఆ రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ కుటుంబాలు జామాతలతో సతమతమ వుతున్నాయి. ఒకటి రామ్‌విలాస్ పాశ్వాన్ కుటుంబం, రెండు లాలూప్రసాద్ యాదవ్ కుటుంబం, మూడు జీతన్ మాంఝీ కుటుంబం. అల్లుడిని నెత్తిన పెట్టుకొని గౌరవించే మనదేశంలో కుమార్తెను బలవంతపు సంతోషంలో ఉంచడానికి అల్లుళ్ల గొంతెమ్మ కోరికలన్నింటినీ తీర్చాల్సి ఉంటుంది. తన పార్టీలో తిరుగులేని నేత అయిన పాశ్వాన్ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కటుంబా సీటును తన అల్లుడికి ఇచ్చేందుకు నిరాకరిం చారు. ఆ స్థానాన్ని పార్టీకి చెందిన మరొక సభ్యుడికి ఇవ్వాలని పాశ్వాన్ నిర్ణయించారు. దీంతో పాశ్వాన్ అల్లుడు టీవీల ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమవుతూ, ‘నేను ఆయనకు అల్లుడినా కాదా?’ అంటూ ప్రశ్నించాడు. తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు తన మద్దతుదారులను కూడగ ట్టాడు. నన్ను స్వంతం చేసుకుంటారో లేక వదిలేస్తారో వాళ్లే తేల్చుకోవాలని కూడా ప్రకటించాడు. దీనిపై లోక్ జనశక్తి పార్టీ స్పందన తగుమాత్రంగా కూడా లేదు. పాశ్వాన్ తనయుడు చిరాగ్ (ఎంపీ) ఈ సమస్యను కుటుంబంలోనే పరిష్కరించుకుంటామని తప్పించుకున్నారు. బావమరిది అంటే అన్న లాంటి వాడు కనుక ఈ వ్యవహారాన్ని కుటుంబ పెద్దలే పరిష్క రిస్తారు అని చిరాగ్ వివరించారు. అంటే పార్టీ కాకుండా కుటుంబమే ఇక్కడ సుప్రీం అన్నమాట. మరోవైపు ఎంపీ తేజ్ ప్రసాద్ యాదవ్ పిల్లనిచ్చిన తన మామ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకే వ్యతిరే కంగా ప్రచారం చేస్తున్నారు. తేజ్ ప్రసాద్ కూడా ములా యం సింగ్ యాదవ్ మునిమనవడు. లౌకికవాదాన్ని సజీవంగా ఉంచడానికి రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల మధ్య సంబంధాలను దృఢతరం చేసే ప్రక్రియలో భాగంగానే ఇతడి పెళ్లి కూడా జరిగింది. పూర్వం రాజులు తమ రాజకీయ బంధాలను బలపర్చు కోవడానికి వివాహ సంబంధాలు కుదుర్చుకున్న చరిత్ర ను ఇది గుర్తుకు తెస్తుంది. అయితే పెళ్లయితే జరిగింది కానీ, ములాయం సింగ్ బిహార్ మహా కూటమి నుంచి తప్పుకోవడంతో ఇక్కడ రాజకీయ బంధానికి తావు లేకుండా పోయింది. ఇక మూడవ ఉదంతం బిహార్ మాజీ ముఖ్య మంత్రి జీతన్ మాంఝీ అల్లుడు దేవేంద్ర మాంఝీతో ముడిపడింది. మాంఝీతో కుదిరిన బాంధవ్యం కారణంగా వ్యక్తిగత సహాయకుడిగా తన పదవి నుంచి దేవేంద్ర వైదొలిగాడు కానీ, అతడి ఆకాంక్షలను పిల్లనిచ్చిన మామ మాంఝీయే తోసిపు చ్చారు. అల్లుడి కి బదులుగా కుమారుడికి అసెంబ్లీ సీటు కట్టబెట్టారు. పార్టీ గుర్తింపులతో సంబంధం లేకుండా రాజకీయ కుటుంబాల మొత్తం ఆచరణ ఎలా ఉందంటే పార్టీలోకి కుమారుడి ప్రవేశం, తర్వాత అతడికి ఏదో ఒక పదవి కట్టబెట్టడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రకటించుకుం టున్నారు. వీరు ఒకసారి గెలుపొందగానే, కుటుంబం నేపథ్యం కారణంగానే అతడికి ప్రమోషన్ ఇచ్చారనే విషయాన్ని కనుమరుగు చేస్తున్నారు. అతడు లేక ఆమె ఓటర్ల ఆమోదం పొందారు మరి. ఇక వంశపారంపర్య రాజకీయాల గురించి రంధ్రాన్వేషణ చేసేదెవరు? ఒక డాక్టర్ కుమారుడు వైద్య వృత్తిని చేపడుతు న్నప్పుడు, లాయర్ కుమారుడు కూడా న్యాయవాద వృత్తిని చేపడుతున్నప్పుడు తప్పేమిటని సాధారణంగా వాదిస్తుంటారు. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటిది జరిగి తే తప్పేమిటనే వాదనతో ప్రజలు ప్రశ్నించడమే మాను కున్నారు. శక్తివంతమైన రాజకీయ నేత వారసుడిగా ఉన్నప్పుడు, ఎన్నికలు ఎలాంటి సైద్ధాంతిక సమస్యలపై కాకుండా, శక్తివంతమైన స్థానిక రాజకీయాల ప్రాతిపది కన జరుగుతున్నప్పుడు రాజకీయ కుటుంబాలు ఈ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ఘటనలను చూస్తుంటే, రాజకీయాల్లో కుమారుడి కంటే అల్లుడి ప్రవేశం అనేది మహా సంకటంగా పరిణమిస్తూ ఉండవచ్చు. ఈ కుటుంబాలు కులం, ప్రాంతంపై పట్టు కలిగి ఉంటాయి. దీంతో ప్రయోజనాలు వారి కుటుంబాలకే అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకు ములాయం కుటుంబాన్నే తీసుకోండి. సమాజ్‌వాదీ పార్లమెంటరీ పార్టీ ఆయన కుటుంబం లాంటిది. పార్లమెంటులో ఏదైనా వ్యూహంపై చర్చించాలనుకుంటే ఆయన కుటుంబ భోజనాల బల్లపైనే జరుగుతుంది. అది కూడా పూర్తి కోరం(నిర్ణీత సంఖ్య)తో జరుగుతుంది. ఆ సమావేశంలో ములాయం, ఆయన మేనల్లుళ్లు ధర్మేంద్ర, అక్షయ్, కోడలు డింపుల్ ఉంటారు. ఇక డింపుల్ భర్త అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ములాయం దాయాది రాంగోపాల్ యాదవ్ రాజ్యసభ ఎంపీ. ఇక ములాయం సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ అఖిలేష్ కేబినెట్లో మంత్రి. కీలక స్థానాల్లో ఉన్న ములాయం కుటుంబ సభ్యులను గమనిస్తే ఇంత శక్తివంతమైన కుటుంబం దేశంలోనే మరెక్కడా లేదనిపిస్తుంది. అల్లుళ్ల ప్రత్యేకతకు తోడుగా, ఇవి రెండు బలమైన రాజకీయ కుటుంబాలు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం దాయాదులను కలుపుకుని పలుతరాల వారితో కూడుకుని ఉంది. ఇక లాలూప్రసాద్ యాదవ్ కుటుంబంలో అయితే అల్లుడి సమస్య కాస్త ఉన్నప్పటికీ, ఆయన పార్టీ ప్రధానంగా తన కుటుంబానికే (భార్య, పిల్లలు) పరిమితమైంది. సాధు అని పిలిచే అనిరుధ్ యాదవ్ లాలూతో రాజకీయ జగడం పెట్టుకుని పార్టీ నుంచి వైదొలగడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి లోక్‌సభ సభ్యుడయ్యారు. ఇలా అల్లుళ్లు, బావమరుదుల సమస్యలు ఉన్నప్ప టికీ, ఈ రెండు కుటుంబాలకు ఒక విశిష్ట లక్షణం ఉంది. పార్లమెంటు లేదా ఏవైనా రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిపిన ప్రతిసారీ దేశం కుటుంబాల నియంత్రణవైపు కొట్టుకుపోతున్నట్లు నిర్ధారణలను అందించేది. పాశ్వాన్ కూడా తన కుటుంబాన్ని రాజకీయ క్రీడలో భాగం చేయడానికి సోదరుడు పశుపతి పాశ్వాన్, మేనల్లుడు ప్రిన్స్ రాజ్‌కు టికెట్లు ఇవ్వాలని చూశారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు నెహ్రూ గాంధీ కుటుంబాన్ని వారసత్వ మూలాలున్న రాజకీయ కుటుంబంగా అనుమాన దృక్కులతో చూస్తున్నప్పటికీ, ఇతరులు కూడా దీన్ని అనుసరిస్తూ రాజకీయ కుటుం బాల వైపు వరుస కడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బిహార్ కేసి చూసినాసరే, దీనికి సంబం ధించి ఎన్నో ఉదంతాలు మనకు కనబడతాయి. చివరకు భారతీయ జనతా పార్టీ కూడా ఈ దురాకర్షణకు లోనవుతోంది. బిహార్‌లో రెండు ప్రధాన కూటములలో అభ్యర్థులను ప్రకటించే కొద్దీ వారికి వ్యతిరేకంగా తిరుగు బాటు కొనసాగుతోందని ది హిందూ పత్రిక ఇటీవలే నివేదించింది. మొత్తం మీద ఘటనలను పరిశీలిస్తుంటే బిహార్‌లో పార్టీకి బదులు కుటుంబాలకే ప్రాధాన్యత ఉందని స్పష్టమవుతుంది. దాంట్లో అల్లుళ్లకు కూడా కాస్త పాత్ర ఉంటోందని చెప్పవచ్చు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) - మహేష్ విజాపుర్కార్